ముషీరాబాద్ (విజయక్రాంతి): మహావీర్ ఇంటర్నేషనల్ అపెక్స్ స్వర్ణోత్సవాలు “స్వర్ణోదయ” పేరుతో ఈ నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్, శంషాబాద్ సిటాడెల్ కన్వెన్షన్లో జరగనున్నాయి. ఈ నెల 4వ తేదీన స్వర్ణోత్సవాలను తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంఎల్ఏ పి.సంజీవ్ రెడ్డి పాల్గొంటారు. ఈ మేరకు గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో మహావీర్ ఇంటర్నేషనల్ అపెక్స్ స్వర్ణోత్సవాల నిర్వహణ కమిటీ చీఫ్ కన్వీనర్లు శీల్ జైన్, అజయ్ నహత, చైర్మన్ వినోద్ సంచేటి, వైస్ చైర్ పర్సన్ అర్చన నహత, కన్వీనర్ సీమ షీల్ కుమార్ జైన్ వివరాలను వెల్లడించారు. అనంతరం స్వర్ణోత్సవాలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వర్ణోత్సవాలతో పాటు మహావీర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ రజతోత్సవాలను కూడా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 800 మంది ప్రతినిధులు పాల్గొంటారని వారు తెలిపారు. విద్య, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాలలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం మహావీర్ ఇంటర్నేషనల్ దేశంలో 350 కేంద్రాలు, 150 నగరాలు, పట్టణాలలో అనేక సంక్షేమ, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని వారు వివరించారు. ఇప్పటికే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మహావీర్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో రెండు ఆసుపత్రులను నిర్వహిస్తున్నామని, మహిళా సాధికారత కోసం అనేక పలు పథకాలను కొనసాగిస్తున్నామని వారు వెల్లడించారు.