calender_icon.png 19 January, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మా.. మాకేంటీ శిక్ష!

12-07-2024 01:59:43 AM

సమస్యలకు నిలయంగా ఎంజీయూ

హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తం

పగిలిన బాత్రూం తలుపులు, పనిచేయని నల్లాలు

పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, క్రీడాస్థలాల్లో పెరిగిన గడ్డి

సరిపడా వంటవాళ్లు లేక తిండికి తిప్పలే

ఇన్‌చార్జి పాలనలో వర్సిటీ విద్యార్థులు సతమతం

ప్రతి జిల్లాకు ఓ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో 2007లో ఏపీ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన యూనివర్సిటీలను ప్రకటించింది. ఇందులో భాగంగా నల్లగొండలో మహాత్మాగాంధీ వర్సిటీని ఏర్పాటు చేశారు. మౌలిక వసతులు, వనరులు, వసతి గృహాల విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతను మరిచారు. దీంతో ఎంజీ వర్సిటీ విద్యార్థుల సమస్యలకు నిలయంగా మారింది.

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులు లేకపోవడంతో చదువులు సక్రమంగా సాగడం లేదు. హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా ఉండటంతో వసతి గృహాల్లో విద్యార్థులకు వ్యథలు తప్పడం లేదు. కాలేజీ గ్రౌండ్ నిర్వహణ లోపంతో గడ్డి విపరీతంగా పెరిగి పాములు, విషకీటకాలతో విద్యార్థులు సావాసం చేయాల్సి వస్తోంది. వంట సిబ్బంది సరిపడా లేక ఆహారం రుచిగా ఉండట్లేదని విద్యార్థులు వాపోతున్నారు. కొన్ని సమయాల్లో విద్యార్థులే వంట చేసుకుని తినాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వీటికి తోడు ప్రస్తుతం రెగ్యులర్ వీసీ లేకపోవడం, ఉన్న ఇన్‌చార్జి వీసీ సమస్యలను పట్టించుకోకపోవడంతో  సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక విద్యార్థులు సతమతమవుతున్నారు.                  

 నల్లగొండ, జూలై 11 (విజయక్రాంతి): నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ సమస్యలకు నిలయంగా మారింది. వర్సిటీలో హాస్టల్ నిర్వహణ అధ్వానంగా ఉండటం, రెగ్యులర్ లెక్చరర్ల కొరత, వంట సిబ్బంది కూడా తక్కువ ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ వీసీ లేకపోవడం, ఉన్న ఇన్‌చార్జి వీసీ సమస్యలను పట్టించుకోకపోవడంతో విద్యార్థుల ఇబ్బందులకు పరి ష్కారం దొరకటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో సమస్యలు ఎవరికి చెప్పు కోవాలో తెలియక విద్యార్థులు సతమతమవుతున్నారు. 

లెక్చరర్ల కొరత

యూనివర్సిటీలో మొత్తం నాలుగు కళాశాలల్లో 18 విభాగాలున్నాయి. వీటిలో సు మారు 1,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అన్ని విభాగాల్లో శాశ్వత అధ్యా పకులు సంఖ్య చాలా తక్కువగా ఉంది. శాశ్వత అధ్యాపకులు కేవలం 35 మంది ఉం డగా కాంట్రాక్టు లెక్చరర్లు 70 మంది, పార్ట్‌టైం లెక్చరర్లు 30 మందికిపైగా పనిచేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకులు లేకపోవడంతో చదువులు సక్రమంగా సాగడం లేదు. ఉన్న శాశ్వత అధ్యాపకులు సైతం సక్రమంగా విధులకు హాజరుకాకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంట్రాక్టు, పార్ట్‌టైం అధ్యాపకులతో తరగతులు నెట్టుకొస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 

వేధిస్తున్న వంట సిబ్బంది కొరత 

వంట చేసి పెట్టేందుకు మెస్‌లో సరిపడా సిబ్బంది లేకపోవడంతో తిండి కోసం వ్యథ తప్పడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెడ్ కుక్ అనారోగ్యంతో కొంతకాలంగా విధులకు హాజరుకావడం లేదు. కొందరు తాత్కాలిక సిబ్బంది వంట చేస్తున్న కారణంగా ఆహారం రుచిగా ఉండడం లేదని వాపోతున్నారు. ఇటీవల వర్సిటీ మెస్‌లో సిబ్బంది లేక విద్యార్థులే వంట చేసుకొని తినాల్సిన దుస్థితి నెలకొందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయినా సమస్య పరిష్కారానికి వర్సిటీ అధికారులు కనీస చొరవ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. వర్సిటీలో సమస్యల కారణంగా కొందరు విద్యార్థులు అడపాడదపా తరగతులకు వచ్చి పరీక్షలకు హాజరై వెళ్తున్నట్లు సమాచారం. 

కనిపించని ఇన్‌చార్జి వీసీ..

ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు ఇన్‌చార్జి వీసీలుగా ఐఏఎస్‌లను నియమించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎంజీయూకు నవీన్ మిట్టల్‌ను నియమించింది. ఆయన ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టి దాదాపు మూడు నెలలు కావొస్తున్నా వర్సిటీ వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఎంజీయూ సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారినా ఇన్‌చార్జి వీసీ నవీన్ మిట్టల్ పరిష్కారానికి కనీస చొరవ చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర వర్సిటీ వీసీలుగా ఉన్న ఐఏఎస్ అధికారులు అక్కడ సమస్యలపై సమీక్షలు నిర్వహించి పరిష్కారానికి ప్రయత్నిస్తుండగా ఎంజీయూలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. 

అధ్వానంగా హాస్టళ్ల నిర్వహణ..

ఎంజీయూలో హాస్టళ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. పరిసరాలు చెత్తమయంగా దర్శనమిస్తున్నాయి. గోడల వెంట మద్యం బాటిళ్లు పడి ఉండడం అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. హాసళ్ల ఆవరణలోనే విరిగిన ఇసుప మంచాలు, కుర్చీలు పడి ఉన్నాయి. బాత్రూంల డోర్లు, కిటికీలు పగిలి, నల్లాలు సక్రమంగా పనిచేయక నీరు వృథాగా పోతుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరిపడా గదులు లేకపోవడంతో ఒక్కో గదిలో ఐదుగురికిపైగా ఉంటున్నారు. క్రీడాస్థలాల నిర్వహణ గాలికొదిలేయడంతో గడ్డి మైదానాలను తలపిస్తున్నాయి. హాస్టళ్ల భవనాల చుట్టూ గడ్డి విపరీతంగా పెరగడంతో రాత్రివేళ పాములు, విష కీటకాలు కనిపిస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిధులు, మానవ వనరుల కొరత: - ఆకుల రవి, ఇన్‌చార్జి రిజిస్ట్రార్, ఎంజీయూ

వర్సిటీ అభివృద్ధికి నిధులు, మా నవ వనరుల లేమితో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఏటా బడ్జెట్‌లో వర్సిటీలకు నిధులు కేటాయిం చాలి. విద్యార్థులకు వసతి గృహాల్లో ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నిధులు, సిబ్బంది సరి పడా లేక కొన్ని పనులు చేయాలన్నా చేయలేని దుస్థితి నెలకొంది. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా.