12-04-2025 01:08:21 AM
కరీంనగర్, ఏప్రిల్ 11 (విజయ క్రాంతి): సామాజిక రుగ్మతలను రూపుమాపి బహుజనుల అభివృద్ధికి కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త, దార్శనీకుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు శాతవాహన యూనివర్సిటీ చౌరస్తా గల పూలే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్ సహా పలువురు బీసీ సంఘాల నేతలు, అధికారులు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే వంటి సంఘసంస్కర్తల కృషివల్లే నేటి సమాజం చైతన్యవంతంగా ఉందని అన్నారు. సమాజ రుగ్మతలను, మూఢాచారాలను అస్పృశ్యతలను రూపుమాపిన జ్యోతి రావు పూలే ఆశయాలు కొనసాగించాలని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కుల గణన చేపట్టిందని, బీసీల రిజర్వేషన్ కోసం చర్యలు తీసుకున్నదని తెలిపారు.
శాతవాహన యూనివర్సిటీ ముందు గల జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద చౌరస్తాను అభివృద్ధి చేస్తామని, ఇందుకు 15 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. నగరంలోని మహాత్మా గాంధీ, జగ్జీవన్ రామ్, అంబేద్కర్ విగ్రహ కూడళ్లను కూడా అభివృద్ధి పరుస్తామని అన్నారు. బీసీలంతా ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని సూచించారు. అనంతరం మహాత్మా జ్యోతిబాపూలే రాసిన పుస్తకాన్ని, తెలుగు, ఇంగ్లీష్ అనువాద పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, పలువురు బీసీ సంఘాల నేతలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.