11-04-2025 12:43:54 PM
ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
కలెక్టర్ బి.యం.సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
గద్వాల, (విజయక్రాంతి): సామాజిక సమానత్వం, విద్యా హక్కు,మహిళా సాధికారత కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. శుక్రవారం గద్వాల్ కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ వద్ద మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి(mahatma jyotiba phule jayanti) సందర్భంగా గద్వాల్ స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తో కలిసి విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేశారని అన్నారు.
ఆయన బాల్య వివాహాల నిర్మూలనకు, మహిళల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలని విశ్వసించిన ఆయన, తొలి బాలికల పాఠశాలను ప్రారంభించి చారిత్రక పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన ఆశయాలను నేడు కూడా సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, పూలే గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయం కోసం కృషి చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూల మాలలు చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు, జిల్లా బి. సి.సంక్షేమ శాఖ అధికారి రమేష్ బాబు, ఎస్సీ సంక్షేమ అధికారి సరోజ,జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.