11-04-2025 04:46:48 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి కార్యక్రమాన్ని కాసిపేట గనిపై శుక్రవారం సింగరేణి అధికారులు, కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేనేజర్ భూశంకరయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు పూలేను ఆధునిక భారతీయ నవయుగ వైతాళికుడిగా కొనియాడారు. వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన మాలికులంలో జన్మించి భారతదేశానికి మార్గదర్శనం చేసిన మహనీయునిగా గుర్తింపు పొందాలని చెప్పారు. ఎందరో ఫూలే నుండి స్ఫూర్తి పొంది సంఘ సంస్కరణలు చేపట్టారాన్నారు.
సమాజంలో నిరక్షరాస్యత, మూఢ విశ్వాసాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండు వారి వలస పాలన, బ్రాహ్మణాధిక్యత, దురాగతాలు, బాల్య వివాహాలు కొనసాగుతున్న కాలంలో జన్మించి స్వయంకృషితో దేశానికి వెలుగుదివ్వె అయ్యారన్నారు. మరాఠీలో, ఇంగ్లీషులో చదువుకొని, రెండు భాషల్లోను అనేక రచనలు చేశారని తెలిపారు. సామాజిక ఉద్యమకారుడిగా ఫూలే స్పర్శించని అంశం లేదన్నారు. కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్న వివక్షను ప్రశ్నించి మనుషులందరూ సమానమేనని చాటారని తెలిపారు.
బెల్లంపల్లి బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్ మాట్లాడుతూ... మనిషిని మనిషిగా చూడని రోజులలో మనుషులకు హక్కులు ఉండాలని ఉద్యమించిన విప్లవ సూరీడు ఫూలే అని అన్నారు. ఎస్సి, ఎస్టీ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి కనుకుల తిరుపతి మాట్లాడుతూ.. మహనీయులు ఫూలే జయంతిని సింగరేణి యాజమాన్యం, చైర్మన్ బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలని నిర్ణయించడం శుభపరిణామామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరీ మీనుగు లక్ష్మీ నారాయణ, ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మన్ దాస్, ఎస్సి, ఎస్టీ అసోసియేషన్ మందమర్రి వైస్ ప్రెసిడెంట్ దాసరి సుదర్శన్, బిసి సంక్షేమ సంఘం నాయకులు పార్వతి సురేష్, అరుణ్, టీబిజికేఎస్ పిట్ సెక్రటరీ బైరి శంకర్, సోల్లంకి శ్రీనివాస్, అసిస్టెంట్ ఫిట్ సెక్రెటరీ రాజేందర్, అరుముళ్ల కృష్ణ, బల్లెం శ్రీనివాస్, అశోక్, సంపత్, పిట్టల శివ కుమార్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్, అండర్ మేనేజర్ దిలీప్, సుమన్ రెడ్డి, ఎస్సి, ఎస్టీ, బిసి అసోసియేషన్ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.