calender_icon.png 26 February, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీరంగూడలో మహాశివరాత్రి వేడుకలు

26-02-2025 06:46:27 PM

మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భారీగా  హాజరైన భక్తులు.. 

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు.. 

పటాన్ చెరు: జిల్లాలోనే సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచే మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. అమీన్ పూర్ మున్సిపల్ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తుల కోసం ఆలయ కమిటీ పాలకవర్గం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది.  ఒక్క రోజే సుమారు లక్షకు పైగా భక్తులు దర్శనానికి వచ్చినట్లుగా ఆలయ నిర్వాహకులు తెలిపారు.

పోలీసులు ప్రత్యేక బందోబస్తుతో ఆలయ పరిసరాలను, క్యూలైన్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, భక్తులు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. పటాన్ చెరు, రామచంద్రపురం, జిన్నారం, గుమ్మడిదల బొల్లారం, తెల్లాపూర్ ప్రాంతాలలోని శివాలయాలలో భక్తులు పూజలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా జిన్నారం మండలం ఓట్ల గ్రామంలో మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు భ్రమరాంబ మల్లికార్జున స్వామి, నరసింహ స్వామి, ఎల్లమ్మ జాతర ఉత్సవాలు జరగనున్నాయి.