26-02-2025 06:02:26 PM
ఇల్లెందు/టేకులపల్లి (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇల్లందు పట్టణం, ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో బుధవారం దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇల్లందు పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న శివాలయంలో భక్తులు వేకువజాము నుంచే వెళ్లి అభిషేకాలు చేశారు. ఇల్లందు సమీపంలోని కోటిలింగాలలో భక్తులతో సందడి నెలకొంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఇల్లందు పట్టణంలోని జెకె కాలనీ సింగరేణి పాఠశాల క్రీడా మైదానంలో జాగారం చేసే భక్తుల కోసం ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో భక్తి వల్లరి కార్యక్రమం ఏర్పాటు చేశారు.
టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ గోవిందాంబ సహిత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో తెల్లవారు జాము నుంచి అభిషేకాలు నిర్వహించగా, మధ్యాహ్నం వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం నిర్వహించగా, రాత్రి పార్వతి పరమేశ్వరుల కళ్యాణం నిర్వహించనున్నారు. బోడు గ్రామంలోని గణపతి దేవాలయం, కొండంగులబోడు గ్రామంలోని శివాలయాల్లో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వ్యభవంగా నిర్వహించనున్నారు.