calender_icon.png 17 October, 2024 | 10:48 PM

మహర్షి వాల్మీకి ఆదికవిగా అందరికీ ఆదర్శనీయం

17-10-2024 08:49:00 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): రామాయణ మహాకావ్యం రూపకర్తగా, ఆదికవిగా అందరికీ సుపరిచితుడైన మహర్షి వాల్మీకి మనిషి తలుచుకుంటే ఏమైనా సాధించగలడని నిరూపించారని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సభావత్ మోతిలాల్ తో కలిసి పాల్గొని మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో రాజు ఏ విధంగా పరిపాలించాలి.

ప్రజలు ఏ విధంగా పరిపాలించబడాలి అనేది తెలుపడంతో పాటు కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు, పిల్లలు ఎలా మెదలాలి అనేది రామాయణ మహాకావ్యం ద్వారా వివరించారని తెలిపారు. తెలుగు సాహిత్యానికి వాల్మీకి చేసిన సేవలు మరువలేనివని, అటవీ తెగకు చెందిన బోయవానిగా జన్మించి రామాయణం మహా గ్రంథాన్ని 23 వేల శ్లోకాలతో, 7 ఖండములతో ఆదికావ్యంగా పూర్తి చేసి మహర్షిగా మారారని అన్నారు. మహర్షి వాల్మీకి అందరికీ ఆదర్శప్రాయుడని, మహనీయులు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ సత్ప్రవర్తనతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బి.వినోద్ కుమార్, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, వాల్మీకి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.