calender_icon.png 28 November, 2024 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివి నుండి భువికి తీసుకువచ్చిన మహానుభావులు భగీరథ మహర్షి

27-11-2024 11:06:39 PM

భగీరథుని చరిత్ర నేటి సమాజానికి తెలియాలి

రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు శేఖర్ సగర

పటాన్ చెరు (విజయక్రాంతి): భూమండలంపై సర్వ జీవకోటికి ప్రాణాధారమైన గంగను ఒంటి కాలుపై కఠోరమైన తపస్సు చేసి దివి నుండి భువికి తీసుకువచ్చిన మహానుభావులు భగీరథ మహర్షి అని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం దోమడుగు గ్రామంలో స్థానిక పటాన్చెరు శాసనసభ్యులు గూడెపు మహిపాల్ రెడ్డి ఆర్థిక సహాయంతో ఏర్పాటుచేసిన శ్రీ భగీరథ మహర్షి విగ్రహాన్ని బుధవారం ప్రతిష్టించారు. ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గూడెపు మహిపాల్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ.. భగీరథుని చరిత్ర నేటి సమాజానికి తెలియ చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

వేల సంవత్సరాల పాటు ఒంటి కాలుపై కఠోరమైన దీక్ష చేపట్టి పరమశివుని మెప్పించి గంగమ్మను దివి నుండి భువికి తీసుకువచ్చిన చరిత్ర భగీరథునిది అని అన్నారు. భగీరథుని వారసులుగా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా సగరుల జీవితం నేడు కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భగీరథుని వంశమైన సగరులను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆర్థికంగా రాజకీయంగా విద్య, ఉపాధి పరంగా అవకాశాలు సన్నగిల్లి అన్ని రంగాలలో వెనుకబాటుకు నెట్టివేయబడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సగరులను చైతన్యం చేసి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి తమ న్యాయమైన డిమాండ్ ను సాధించుకుంటామని ఆయన అన్నారు. భగీరథుని విగ్రహాన్ని రాష్ట్ర రాజధాని హైదరాబాదు ట్యాంక్ బండ్ పై మహనీయుల సరసన ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వం మంచినీటి పథకానికి మిషన్ భగీరథ అని నామకరణం చేసి చేతులు దులుపుకుంది తప్ప సగరులకు చేసిందేమీ లేదని శేఖర్ సగర ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అన్ని జిల్లాలలో ఇలాంటి విగ్రహాలను ఏర్పాటు చేసి తమ జాతిని మరింత చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక దోమడుగు సగర సంఘం అధ్యక్షులు ఆంజనేయులు, మాజీ సర్పంచ్ రాజశేఖర్ సగర, ముత్యాల హరి కిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రేఖబు మురళీకృష్ణ సగర, జిల్లా ప్రధాన కార్యదర్శి అంజయ్య సగర, జిల్లా కోశాధికారి చిన్న అంజయ్య సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు డిండి శేఖర్ సగర తదితరులు పాల్గొన్నారు.