28-01-2025 12:00:00 AM
ఐ.వి.మురళీకృష్ణ శర్మ :
చారిత్రాత్మకమైన పుణ్యక్షేత్రాలకు, జాతర్లకు పేర్గాంచిన తెలంగాణలో ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రాష్ర్టంలో దేవాలయాల అభివద్ధికి తోడ్పతున్నాయి. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారక్క జాతరకు తొలిసారిగా రూ.110 కోట్లు మంజూరు చేసింది. ఈ జాతరకు హాజరు కాలేని భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో బంగారం సమర్పణ, ప్రసాదాల పంపిణీ కోసం మీసేవా, టీయాప్ ప్రవేశపెట్టారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో రాష్ర్ట పండుగగా గుర్తింపు పొందిన అమ్మవారి బోనాల ఉత్సవాలకు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.20 కోట్లు ఇవ్వడంతో జాతర జనరంజకమైంది. రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 400కుపైగా ఆలయాల అభివద్ధి కోసం ప్రభుత్వం పాలక కమిటీల ఏర్పాటుకు నోటిఫికేషన్లు జారీ చేసింది.
దీంతో ఆలయాల నిర్వహణలో పారదర్శకత పెరిగేందుకు అవకాశా లు ఏర్పడ్డాయి. దేవాదాయశాఖ అటవీ, రెవెన్యూ, పర్యాటక శాఖల సమన్వయంతో ఆహ్లాదకరమైన మూడు టెంపుల్ టూరి జం సర్క్యూట్లను ఏర్పాటు చేసింది.
రాష్ర్టంలో ప్రముఖ దేవాలయాల్లో పర్వదినాలు, పవిత్ర మాసాలలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆలయాలవద్ద భక్తి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం కషి చేస్తున్నది. మునుపెన్నడూ లేని విధంగా కార్తీకమాసంలో దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.
రాష్ర్టంలో పలు ఆలయాల్లో సామూహిక దీపోత్సవాల కో సం 126 ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేసి ఉచితంగా దీపం సామగ్రిని అందించడంతోపాటు ఇతర సౌకర్యాలూ కల్పించింది. బాసర జ్ఞాన సరస్వతి, ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయాలలో ‘నదీ హారతి’తో పాటు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఆక్రమాలకు అడ్డుకట్ట
తెలంగాణలో రాష్ర్టవ్యాప్తంగా కోట్ల రూపాయల విలువ చేసే దేవాలయాల భూములు, ఆస్తులు అన్యాక్రాంతం కాకుం డా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో దేవాదాయ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ప్రభుత్వం హక్కులు పొంది స్వాధీనం చేసుకుంది.
విలువైన దేవాలయ భూములు, ఆస్తులు కబ్జా కోరల్లో పడకుండా పక్కా ప్రణాళికతో ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత దేవాలయానికే యాజమాన్య హక్కులు కల్పిస్తూ భూపట్టాలు అందజేసేలా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.
ఫలితంగా ఆలయాల భూముల అక్రమాలు కట్టడయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. పక్క రాష్ట్రాల్లోని తెలంగాణ దేవాదాయ శాఖకు చెందిన భూములనూ గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది.
నిరుపయోగంగా ఉన్న దేవాలయాల భూముల ద్వారా ఆదాయ వనరులు సమకూర్చుకునే దిశలో భాగంగా పామాయిల్ సాగును ప్రోత్సహించాలని దేవాదాయ శాఖ మార్కెఫెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటున్నది.
అంతేకాక, ఆలయాల భూములను సోలార్ పవర్ ప్లాంట్లకు వినియోగించుకోవాలని భావిస్తున్న దేవాదాయ శాఖ, ఈ పనుల కోసం పంచాయతీ రాజ్‌కు చెందిన ఇందిరా మహిళా శక్తి గ్రూపులతో అవగాహన కుదుర్చుకోవడంతో మహిళా సాధికారితకు ఊతమిచ్చినట్టవుతున్నది.
సమస్యలకు సత్వర పరిష్కారాలు
రాష్ర్టంలో పలు ఆలయాలను స్వయం గా సందర్శించిన దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ ఆయా ప్రాంతాల్లో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. సాంకేతికతను వినియోగించుకొని పలు దేవాలయాల్లో ‘క్యూ ఆర్ కోడ్’ ద్వారా దర్శనం, ఆర్జిత సేవలు, స్లాట్ బుకింగ్స్, ప్రసాదాల పంపిణీ, గదులు కేటాయింపుల సమాచారం సులభంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
దేవాలయాల్లో ప్రసాదాల కోసం నాణ్యమైన నెయ్యినే వినియోగించాలని మంత్రి ఆదేశించారు. ఆలయాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, కనీసావసరాలు తీరాలనే లక్ష్యంతో ధూప, దీప, నైవేద్యం పథకాన్ని ఇప్పుడు మరిన్ని దేవాలయాలకు అందించేందుకు తెలంగాణ దేవాదాయ శాఖ కృషి చేస్తున్నది.
రాష్ర్టంలో 6500కు పైగా ఆలయాలకు ప్రతినెల రూ.10,000 చొప్పున ఇచ్చేందుకు రూ.6 కోట్లకు పైగా పారితోషకాన్ని చెల్లిస్తుంది. ఇందుకు రూ.73 కోట్ల బడ్జెట్ కేటాయించారు. రూ.20 లక్షలకంటే ఎక్కువ ఆదాయమున్న దేవాలయాల నుంచి 3 శాతం నిధులు సేకరించి ఆలయాల అర్చకులు, సిబ్బంది సంక్షేమం కోసం ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఒక సంక్షేమ నిధి ట్రస్టును ఏర్పాటు చేసి వారిలో భరోసాను నింపింది. సిబ్బంది కుటుంబాలలో శుభకార్యాలకు చేయూత ఇచ్చేలా ఉపనయనా నికి రూ.50 వేల సబ్సిడీతో రూ.1 లక్ష, పెళ్లికి రూ.1 లక్ష సబ్సిడీతో రూ.2 లక్షలు ప్రభుత్వం అందిస్తున్నది.
దేశంలోనే ప్రముఖ ఆలయమైన యా దగిరి గుట్టతోపాటు ఇతర దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.400 కోట్ల నిధులు కేటాయించింది. టీటీడీ తరహాలో యాదాద్రిలో పాలకమండలి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం గుట్టలో పిల్లలు, వద్ధులు, వికలాంగుల కోసం బ్యాటరీ వాహనాలు సమకూర్చింది.
భక్తుల విశ్వాసం మేరకు ఇప్పుడు ప్రభుత్వం వెయ్యిమంది కొండపై నిద్రించేందుకు డార్మెటరీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంది. కొండపైకి గత ప్రభు త్వ హయాంలో ఆటోల రాకపోకలపై నిషే ధం ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం కొండపైకి ఆటోలను అనుమతించడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుట్టపై గతంలో అన్న ప్రసాదం 500 మందికే లభించేది. ఇప్పుడు వెయ్యిమందికి అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలో ప్రసిద్ధి క్షేత్రాలు వేములవాడ, భద్రాచలం ఆలయాల అభివద్ధికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్స్ రూపొందించింది. వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయ అభివద్ధి కోసం రూ.127 కోట్లు కేటాయించి పలు సౌకర్యాలతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇక్కడ కూడా యాదగిరిగుట్ట తరహాలో స్వర్ణ తాపడం ప్రక్రియ ప్రారంభమైంది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆన్‌లైన్‌లో సేవలు తీసుకొచ్చి భక్తులకు ఆర్జిత, వసతి సేవలను సులభతరం చేశారు. ఇక్కడ నూతన కాటేజీలు నిర్మించడంతోపాటు పిల్లలు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నారు.
భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే పలు విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ప్రభుత్వం రాబోయే మహాశివరాత్రి కోసం వేములవాడ, కీసరగుట్ట, కాళేశ్వరం ఆలయాల ప్రసాదాలను టీయాప్, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నది.
ప్రజల విశ్వాసాలు, ఆశలను అడియాసలు చేయకుండా రాష్ర్ట వ్యాప్తంగా దేవాలయాల అభివద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలు అభినందనీయం. తెలంగాణలో ఆలయాలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.