- ఒక్కో స్కూల్ అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు
- మొదటిదశలో తరగతి గదులు, ల్యాబ్‌ల నిర్మాణం
- ఐదేళ్లపాటు పాఠశాలలకు నిధుల కేటాయింపు
- మెదక్ జిల్లాలో 31 పాఠశాలల ఎంపిక
మెదక్, నవంబర్ 15(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పూర్తిస్థా యిలో మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్రం పటిష్ఠమైన చర్యలు చేపడుతోంది. ఈ మేరకు నూతన విద్యావిధానం 2020లో భాగంగా పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రధానమంత్రి స్కూల్ రైజింగ్ ఫర్ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్ని తీసుకొచ్చింది.
ఈ పథకం కోసం సంబంధిత పాఠశాల హెచ్‌ఎం ఆన్‌లైన్ విధానంలో ఫొటోలు, ఇతర ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధిక సంఖ్యలో విద్యార్థులు, కొద్దిపాటి వసతులు ఉన్న పాఠశాలలను ఎంపిక చేసి మెరుగుపరిచేందుకు కృషి చేస్తారు. ఈ మేరకు పథకానికి రెండు దశల్లో కలిపి ఇప్పటి వరకు మెదక్ జిల్లావ్యాప్తంగా 31 పాఠశాలలు ఎంపికయ్యాయి.
ఇందులో కేజీబీవీలు, గురుకులాలతో పాటు ఎక్కువ సంఖ్యలో హైస్కూళ్లు ఉం డగా ప్రాథమిక పాఠశాలలకు సైతం చోటు లభించింది. వీటిలో భవిష్యత్ అవసరా లను దృష్ట్యా స్కూళ్లను గ్రీన్ పాఠశాలలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రతీ స్కూల్‌కు రూ.2 కోట్లు
ఒక్కో పాఠశాలకు ఐదేళ్ల వ్యవధిలో రూ.2 కోట్ల నిధులను విడతలవారీగా మంజూరు చేయనున్నారు. ఇందులో రూ.కోటి నిర్మాణాల కోసం, మరో రూ.కోటిని వివిధ పరికరాల కొనుగోలు, ల్యాబ్‌ల ఏర్పాటుకు వెచ్చిస్తారు. పాఠశాలకు ఇచ్చే నిధుల్లో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నాయి.
ఈ స్కీం ద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, వారికి అవసరమయ్యే సైన్స్ ల్యాబ్‌లను నిర్మిస్తారు. పీఎంశ్రీలో భాగంగా జిల్లాలో ఎంపికైన 31 పాఠశాలల్లో రెండు తరగతి గదులు, ఒక సైన్స్ ల్యాబ్‌లను నిర్మిస్తున్నట్లు విద్యాధికారులు చెబుతున్నారు.
గ్రీన్ పాఠశాలలుగా మార్పు
పీఎంశ్రీకి ఎంపికైన వాటిని గ్రీన్ పాఠశాలలుగా మార్చేందుకు కృషి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా పాఠశాలలకు అవసరమయ్యే విద్యుత్ పూర్తిగా అక్కడే ఉత్పత్తి చేసుకునేలా రోప్‌పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి (రెయిన్ హార్వెస్టింగ్) పాఠశాల అవసరాలకు నీటిని వినియోగించుకునేలా తీర్చిదిద్దుతారు.
పూర్తిస్థాయిలో ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన కూరగాయలు, ఇతర ఔషధ మొక్కలను పెంచేందుకు న్యూట్రిగార్డెన్స్ ఏర్పాటు చేస్తారు. పాఠశాలల్లో వెలువడుతున్న చెత్త నిర్వహణ, ప్రహారీల నిర్మాణం చేపట్టున్నారు.
బడుల సర్వతోముఖాభివృద్ధి
ప్రభుత్వం తీసుకొవచ్చిన పీఎంశ్రీ పథకంతో పాఠశాలలు సర్వతోముఖాభివృద్ధి చెందనున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు గ్రీన్ స్కూల్ ఏర్పాటు వల్ల పిల్లలు కాలుష్యానికి దూరంగా ఉంటారు. ప్రతీ పాఠశాల అవసరానికి తగ్గట్టు ప్రభుత్వం నిధులు ఇవ్వనుంది. వీటితో తరగతి గదులు, ల్యాబ్‌లు, సోలార్ ప్యానెల్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటివి సమకూరుతాయి. సైన్స్ ల్యాబ్, అదనపు తరగతి గదుల కోసం ప్రత్యేకంగా నిధులు వస్తాయి. ప్రస్తుతానికి జిల్లాలో 31 పాఠశాలలను ఎంపిక చేయగా వాటిలో కొనసాగుతున్నాయి.
రాధాకిషన్, డీఈవో, మెదక్