calender_icon.png 29 October, 2024 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ రోడ్లకు మహర్దశ

29-10-2024 02:08:09 AM

  1. రూ.12 వేల కోట్లతో ప్రతిపాదనలు
  2. నాలుగేండ్లలో 17,300 కిలోమీటర్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక
  3. వార్షిక లక్ష్యాలను నిర్ధేశించుకున్న పంచాయతీరాజ్ శాఖ
  4. పీపీపీ విధానంలో అభివృద్ధికి ప్రతిపాదనలు
  5. ఇటీవల వర్షాలకు భారీగా దెబ్బతిన్న పీఆర్ రోడ్లు

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): గ్రామాల్లోని రోడ్లకు మహర్దశ పట్టనుంది. వచ్చే నాలుగేళ్లలో రూ.12వేల కోట్ల అంచనా వ్యయంతో  17,300 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయాలని పంచాయతీరాజ్ విభాగం ప్రతిపాదనలు తయారు చేసింది. దీనికి శనివారం జరిగిన క్యాబినెట్‌లో ఆమోదం లభించింది.

దీంతో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్న రోడ్లన్నింటినీ బాగు చేసేందుకు సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ఏడాదికి నాలుగు నుంచి ఐదు వేల కిలోమీటర్ల వరకు రోడ్లను అభివృద్ధి చేసి.. తద్వారా వచ్చే నాలుగేళ్లలో లక్ష్యాన్ని చేరుకోవాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే మొత్తం 17,300 కిలోమీటర్ల రోడ్లను బాగు చేసేందుకు ఏడాదివారీగా ప్రణాళికను రూపొందించింది.

2024 5 వేల కిలోమీటర్లు, 2025 4 వేల కిలోమీటర్లు, 2026 5 వేల కిలోమీటర్లు, 2027 3,300 కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్లానింగ్‌ను సిద్ధం చేసింది. సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చిన వరదలతో గ్రామాల్లోని రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో నష్టంపై వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్రంలో 17,300 కిలోమీటర్ల రోడ్లను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   

30 మెట్రిక్ టన్నుల సామర్థ్యమే లక్ష్యంగా..

గత ప్రభుత్వం పదేళ్లపాటు తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహణతో పాటు పునరుద్ధరణ అటకెక్కింది. నిరంతరం కురిసిన భారీవర్షాలతో రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో పీఆర్ రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్య పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో పంచాయతీరాజ్‌కు సంబంధించిన అనేక రోడ్లు మరమ్మతులకు గురయ్యాయి.

దీంతో తాజాగా మరమ్మతులకు గురైన రోడ్లతో పాటు గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రహదారులను కూడా కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం పంచాయతీ రాజ్ రోడ్లు 10 మెట్రిక్ టన్నుల వాహన సామర్థ్యంతో ఉన్నాయి.

కాగా పీఆర్ రోడ్లపై 25 నుంచి 30 మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న వాహనాలు నడుస్తున్నాయి. ఫలితంగా రోజురోజుకు రోడ్లు దెబ్బతింటున్నాయి. అందుకే వినియోగానికి అనుకూలంగా గ్రామీణ రోడ్లను బాగు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది.

పీపీపీ మోడ్‌లో అభివృద్ధి 

గ్రామాల్లో రోడ్ల నిర్మాణాన్ని పీపీపీ మోడల్‌లో చేపట్టాలని ప్రభు త్వం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపా దనలు కూడా సిద్ధమయ్యాయి. రో డ్లు నిర్మించిన సంస్థకే పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతను కూడా అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా ఉండగా.. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. మట్టి రోడ్లు, మెటల్ రోడ్లు లేని పంచాయతీలే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

రాష్ట్రంలోని రహదారుల వివరాలు

పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని మొత్తం రోడ్లు        68,539.27 కిలోమీటర్లు

బీటీ రోడ్లు        26146.83 కిలోమీటర్లు

డబ్ల్యూబీఎం రహదారులు        7752.10 కిలోమీటర్లు

సీసీ రోడ్లు        4146.63 కిలోమీటర్లు

ఇతర రహదారులు         30493.72 కిలోమీటర్లు