ప్రధాన పార్టీల ఓట్లు చీల్చే అవకాశం
ఎన్డీయే కూటమికే అధిక లాభం!
గత ఎన్నికల్లోనూ ఇదే వరస
ముంబై, నవంబర్ 14: మహారాష్ట్ర ఎన్నికలను జాతీయ స్థాయిలో కీలకంగా భావిస్తు న్నారు. ఈ పెద్ద రాష్ట్రంలో ప్రధానంగా రెండు కూటములే తెరపై కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న మహాయుతి, ప్రతిపక్ష మహావికా స్ అఘాడీ మధ్యే ప్రధాన పోరు కనిపిస్తోంది. అయితే, ప్రచారంలో చిన్న పార్టీలు పెద్దగా కనిపించకపోయినా కూటముల గెలుపోటము లపై మాత్రం కచ్చితంగా ప్రభావం చూపే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
గట్టి పోటీ ఉన్న ప్రాంతాల్లో ఇండిపెండెంట్లు, ఎంఐఎం, ఎంఎన్‌ఎస్, వీబీఏ పార్టీలు ప్రధాన అభ్యర్థుల ఓట్లను చీల్చి ఫలితాలను తారుమారు చేసే అవకాశముందని చెప్తున్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే వీరు కింగ్‌మేకర్లుగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.
చీలికలతో ప్రధాన పార్టీలకు ఇబ్బంది
రాజకీయ విశ్లేషకుల ప్రకారం పై పార్టీలు, స్వతంత్రులు కలిసి 30 సీట్ల వరకు గెలుస్తారని, హంగ్ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో వీరి సహకారం అవసరం ఉంటుందని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఈ పార్టీలు 29 సీట్లను దక్కించుకున్నాయి. 63 స్థానాల్లో సెకండ్ ప్లేస్‌లో నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ పార్టీలు అనేక స్థానాల్లో నిర్ణయాత్మకంగా మారే అవకాశముంది. గత ఎన్నికలతో ప్రస్తుతం మారిన రాజకీయాల నేపథ్యంలో ఈ పార్టీల అభ్యర్థులు కొంతమంది బలంగా కనిపిస్తున్నారు.
అందువల్ల ఫలితాలు మిశ్రమంగా వచ్చే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరాఠా కార్యకర్త మనోజ్ పాటిల్ ఎన్నికల నుంచి తప్పుకున్నా ఆయన ప్రభావం మహారాష్ట్ర ఎన్నికలపై ఉంటుందని చెప్తున్నారు. మరఠ్వాడాలో ఆయన మద్దతిచ్చిన అభ్యర్థులే గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు.
ముంబైలో బలంగా ఎంఎన్‌ఎస్
బాల్ ఠాక్రే మరణం తర్వాత శివసేన నుంచి వేరుపడిన రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్)ను స్థాపించారు. ఈ పార్టీ ముంబై దాని శివారు ప్రాంతాల్లో బలంగా ఉంది. బీజేపీ, శివసేనకు ఇది ప్రత్యామ్నాయంగా మారి సవాల్ విసురుతోంది. మొత్తంగా 36 స్థానాల్లో బరిలోకి దిగుతున్న ఎంఎన్‌ఎస్ కేవలం ముంబైలోనే 25 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా, ఈ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని భావిస్తారు.
దళితులే లక్ష్యంగా వీబీఏ
బాబాసాహెబ్ అంబేడ్కర్ మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ స్థాపించిన పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ). దళితులు, బౌద్ధులు, ముస్లింలు, ఇతర మైనారిటీ కమ్యూనిటీల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పార్టీ ఇది. ఈ పార్టీ కూడా ప్రధాన పార్టీలకు పోటీ ఇచ్చే స్థాయిలో 67 మందిని బరిలోకి దింపింది. ముఖ్యంగా ముంబై, విదర్భ ప్రాంతాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. మహారాష్ట్రలో 14 శాతం దళిత జనాభా ఉండగా అందులో 7 శాతం బౌద్ధ దళితులు ఉన్నారు.
దళితులపై ఒవైసీ ఫోకస్!
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను తారు మారు చేయగల శక్తి ఎంఐఎం పార్టీకి ఉంది. హైదరాబాద్ తర్వాత ముస్లిం ఓట ర్లు ఎక్కువగా ఉన్న ఔరంగబాద్, ముంబై ప్రాంతాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పార్టీ ఇతర ప్రాంతాల్లో కూడా ముస్లిం ఓట్లను పొందినా, చీల్చినా ఆ ప్రభావం ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో తన పార్టీని విస్తరిం చాలని భావిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ ఈసారి ఎన్నికల్లో తన పార్టీ తరఫున 12 మందిని బరిలోకి దించారు.
ఈ ఎన్నికల్లో ఆయన కేవలం ముస్లిం ఓట్లను మాత్రమే కాకుండా దళితుల ఓట్లను కూడా టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే నాలుగు స్థానాల్లో దళిత నేతలను నిలబెట్టారు.