ముంబై: మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్నకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమాధానమిస్తూ.. సీఎం కుర్చీపై ఎలాంటి వివాదాలు ఉండవని, ఎన్నికల తర్వాత మూడు పార్టీల నేతలు ఒకే చోట కూర్చోవాలని మొదటి రోజు నుంచే నిర్ణయించాం. ఈ నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది, దీనిపై ఎలాంటి వివాదం లేదన్నారు. మహారాష్ట్ర ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా ఉన్నారనేదానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని దేవేంద్ర పడ్నవీస్ అన్నారు. మహా వికాస్ అఘాడీ తప్పుడు కథనాలు, మతం ఆధారంగా ఓటర్లను ఆకట్టుకోవడం వంటి ప్రతిపక్షాల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. ఓటర్ల మద్దతు, పార్టీ శ్రేణుల సాయంతో ప్రతిపక్షాల చక్రవ్యూహాన్ని ఛేదించడంలో సఫలమయ్యానని వెల్లడించారు. మహారాష్ట్రలో ఘన విజయం కట్టబెట్టిన మహిళా ఓటర్లకు పడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో మహాయుతి 101 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా 125 స్థానాల్లో విజయం సాధించింది. అటు ఎంవీఏ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఇప్పటి వరకు 26 స్థానాల్లో గెలుపొందారు. ఇతరు ఐదు స్థానాల్లో ముందంజలో ఉండగా రెండు స్థానాల్లో విజయం సాధించారు. అటు జార్ఖండ్ జేఎంఎం కూటమి 31 స్థానాల్లో ఆధిక్యంలో.. 26 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ కూటమి 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా 13 స్థానాల్లో గెలిచింది.