రెండు రాష్ట్రాల్లో ప్రచారానికి తెర
చివరి రోజు జోరుగా ప్రచారం చేసిన నేతలు
మహారాష్ట్రలో అధికార, విపక్షాల యాడ్స్ వార్
మోదీ సేఫ్ నినాదంపై రాహుల్ గాంధీ కౌంటర్
న్యూఢిల్లీ, నవంబర్ 18: మహారాష్ట్రలో ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 288 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం పార్టీలు తమ ప్రచారాన్ని ముగిశాయి. చివరి రోజు కావడంతో అధికార, విపక్ష కూటములు జోరుగా ప్రచారం నిర్వహించాయి. వార్తా పత్రికలు, టీవీల్లో ప్రకటన రూపంలోనూ యుద్ధం చేసుకున్నారు.
జార్ఖండ్‌లోనూ రెండో విడతలో మిగిలిన 38 స్థానాల్లో పోలింగ్ బుధవారమే జరగనుంది. ఆ రాష్ట్రంలోనూ సోమవారమే మైకులు బంద్ అయ్యాయి. త్వరలోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్డీయే ప్రభుత్వం చెబుతుండటంతో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
ఎవరి భద్రత మోదీజీ..?: రాహుల్
ఐక్యంగా ఉంటేనే భద్రంగా ఉంటామంటూ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ముంబైలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామంటున్నారు. ఇక్కడ నాకో సందేహం ఉంది. ఆయన ఎవరి భద్రత గురించి మాట్లాడారు? అని ప్రశ్నించారు. మోదీ సర్కార్ పారిశ్రామిక వేత్తల కోసమే పనిచేస్తోందని, పేదవారిపై వారు ఎలాంటి దృష్టి పెట్టరని ఆరోపించారు.
ధారావిలో పునర్నిర్మాణం ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ కొందరికే ప్రయోజనం చేకూరేలా ఉందని, కానీ అక్కడి ప్రజల తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎంవీఏ కూటమి అధికారంలోకి వచ్చాక స్థానిక ప్రజల భూములను తిరిగి అప్పగిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
చివరి రోజు యాడ్స్ వార్
మహారాష్ట్రలో బీజేపీ సోమవారం వార్తాపత్రికల్లో ఇచ్చిన ప్రకటనలపై రాజకీయ దుమారం చెలరేగింది. రాష్ట్రంలో విపక్షాల హయాంలో జరిగిన సంఘటనలను పేర్చి యాడ్స్ ఇచ్చింది. ముంబై ఉగ్రదాడులు, కొవిడ్ కిట్ కుంభకోణం, పాల్ఘర్‌లో సాధువుల హత్యపై సీబీఐ విచారణ నిలిపేయడం, రైళ్లలో పేలుడు, అంబానీకి బెదిరింపులు, పలు అవినీతి ఆరోపణలను అందులో ప్రస్తావించింది. అంతేకాకుండా కర్ణాటక పథకాలపైనా ప్రకటనలు ఇస్తూ కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ముంబై ఓటర్లను హెచ్చరించింది.
దీంతో ఈ విషయాన్ని సిద్ధరామయ్య ప్రభు త్వం సీరియస్‌గా తీసుకుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దీనిపై స్పందిస్తూ ఓట్ల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మహాయుతి ప్రభుత్వంపై చట్టపరంగా చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. మరోవైపు మహాయుతి ప్రభుత్వంపైన మహావికాస్ అఘాడీ కూటమి సైతం యాడ్స్ ఇచ్చింది. హిట్ అండ్ రన్ కేసు, మహిళలపై నేరాలు, హామీలు నెరవేర్చకపోవడం, శివాజీ విగ్రహం ఘటన, ఉద్యోగాలు వంటి అంశాలను పేర్కొంది.