calender_icon.png 18 November, 2024 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలో శివాజీ రాజకీయం

02-09-2024 12:28:45 AM

  1. రాజకీయ ప్రయోజనాలే పరమార్థంగా పావులు
  2. షిండే, అజిత్ అడ్డు తొలగించుకునేందుకు బీజేపీ ఎత్తులు
  3. అధికార పార్టీపై విమర్శలకు ఎంవీఏ ప్రయత్నాలు
  4. మోదీ క్షమాపణల్లో అహంకారం: ఉద్ధవ్ ఠాక్రే
  5. నిరసన ర్యాలీలో చెప్పులు ప్రదర్శించిన విపక్షాలు

ముంబై, సెప్టెంబర్ 1: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనపై మహావికాస్ అఘాఢీ ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్, కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలే పాల్గొన్నారు. ఈ ర్యాలీలో చెప్పులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఈ వ్యవహారంపై విపక్షాలతో పాటు అధికార కూటమి మధ్య కూడా విభేదాలు కనిపిస్తున్నాయి.

దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షో భానికి దారి తీస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార బీజేపీ, ఎన్సీపీ, శివసేన మధ్య ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా గతేడాది డిసెంబర్ 4న సింధుదుర్గ్‌లోని 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అది ఇటీవల గాలికి కూలిపోయింది. రాజకీయ పార్టీ లు మాత్రం ఈ ఘటనను వాడుకుని తమ ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. 

చెప్పులతో నిరసన

సింధుదుర్గ్‌లోని శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టింది. ఉద్ధవ్ ఠాక్రేతో పాటు శరద్‌పవార్, నానా పటోలే ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ముంబైలోని హుటాత్మా చౌక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ఉన్న శివాజీ విగ్రహం వరకు చప్పల్ జోడే మారో యాత్ర (చెప్పులతో కొట్టు) అంటూ నిరసన చేపట్టారు. పెద్దపెద్ద చెప్పుల నమూనాలను ప్రదర్శిస్తూ యాత్ర ను కొనసాగించారు. తొలుత హుటాత్మా చౌక్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు. కాగా, ఈ మార్చ్‌కు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో హుటా త్మా చౌక్‌లోనే సమావేశాన్ని నిర్వహించారు. 

సొంతంగా పోటీకి..

విగ్రహం కూలిపోవటంపై ప్రభుత్వ విభాగాలు కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటుడటం గమనార్హం. నిర్మాణం, డిజైన్ లో భాగస్వాములైన భారత నేవీ, పీడబ్ల్యూడీ శాఖలు ఒకరిపై మరొకరు మండిపడుతున్నారు. కాగా, కొన్నినెలల్లో రాష్ట్రంలో ఎన్నిక లు జరగనుండగా.. మహా రాజకీయం ఈ ఘటనతో వేడెక్కింది. రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. ప్రతి పార్టీ తమ విజయావకాశాల కోసం ప్రయత్నిస్తున్నాయి. కానీ గత రెండు దశాబ్దాల కుపైగా రాష్ట్రంలో బలంగా ఉన్న బీజేపీ సొంతంగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. విగ్రహం ఘటన కూడా పొత్తు విషయంలో కమలానికి కలిసివచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తు తం ఎన్డీయే అధికారంలో ఉన్నప్పటికీ ప్రభుత్వాధినేతగా మాత్రం శివసేన చీఫ్ ఏకనాథ్ షిండే ఉన్నారు. విగ్రహం కూలిపోవడంతో పూర్తి బాధ్యత షిండేపైనే నెట్టేశారు. దీంతో ప్రజలకు షిండే పలుమా ర్లు క్షమాపణలు చెప్పారు. 

పార్లమెంట్ ఫలితాల ఎఫెక్ట్

కూటమి పార్టీలను చీల్చడంతో పాటు శివసేన, ఎన్సీపీలోని కీలక నేతలను ఆకర్షించి ఆ రెండు పార్టీలను తమ చెంతకు చేర్చుకోవడంతో బీజేపీపై రాష్ట్రంలో కొంత వ్యతిరేకత ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి రిజల్ట్స్ ప్రతికూలంగా వచ్చాయని చెప్పవచ్చు. కానీ, బీజేపీ కన్నా షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ పేలవ ప్రదర్శన కనబర్చాయి. ఈ పరిస్థితుల్లో నేరుగా పొమ్మనలేక బీజేపీ పొగ బెడుతున్నట్లు కనిపి స్తోంది. పరిస్థితులను ఆసరాగా చేసుకుని పొత్తును కూలదోసి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంతో పొత్తు కూడిన అజిత్ పవార్ ఎన్సీపీకి సీఎం షిండే పార్టీతో పడటంలేదు. దీంతో అధికార కూటమిలో ౩ పార్టీలు ఈ అంశాన్ని ఓ పావులా మార్చుకుని తమ ప్రయోజనాలు కాపాడునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

అడ్డు తొలిగించుకునేందుకు..

షిండే సీఎంగా ఉండటంపై బీజేపీ, ఎన్సీ పీ కొంత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆ విభేదాలు ఎక్కడా అధికార కూటమి బయటికి రానియ్యటం లేదు. శివసనే, ఎన్సీపీ మధ్య పరస్పర విభేదాలు ఉన్నట్లు తాజాగా శివసేన ఎంపీ తానాజీ ఎన్సీపీపై చేసిన అసభ్యకర వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.  మరోవైపు విగ్రహ ఘటన విషయం లో బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతోంది. ఓ వైపు క్షమాపణలు చెబుతూనే శివసేన, ఎన్సీపీ పార్టీలను దూరం పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. విపక్షాలు చేసే ఆరోపణలు సైతం బీజేపీకి అనుకూలంగానే మారేటట్లు కనిపిస్తున్నాయి. 

క్షమాపణల్లోనూ అహంకారం

శివాజీ విగ్రహం ఘటనపై అధికార కూటమితో పాటు ప్రతిపక్ష కూటమి సైతం రాజ కీయంగా వాడుకోవాలని చూస్తోంది. ప్రభుత్వంపై శివసేన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి ంది. శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పడంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే స్పందించారు. క్షమాపణల్లోనూ అహంకారాన్ని చూసినట్లు ఆరోపించారు. మోదీ క్షమాపణలు ఎందుకు చెబుతున్నారు? 8 నెలల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం కూలిపోయినందుకా? లేదంటే విగ్రహం నిర్మాణంలో అవినీతి చోటు జరిగినందుకా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. శివాజీ మహారాజ్‌ను అవమానించిన శక్తులను ఓడించేందుకు మహావికాస్ అఘాడీ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.