calender_icon.png 9 November, 2024 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలో రాయల్ రాజకీయం

09-11-2024 01:47:24 AM

రాజవంశీకులపై ఆధారపడ్డ పార్టీలు

బరిలో ఛత్రపతి శివాజీ వారసులు

ప్రజాదరణ పొందేందుకు ప్రయత్నాలు

 నవంబర్ ౮: స్వాతంత్య్రం తర్వాత భారతదేశంలో రాచరికాన్ని కాదని అప్పటివరకు బ్రిటీష్ ప్రభుత్వం అనుసరించిన ప్రజాస్వామ్య ప్రభుత్వంవైపే రాజ్యాంగ నిర్మాతలు మొగ్గుచూపారు. స్వాతంత్య్రానంతరం కొంతమంది రాజవంశీకులకు ప్రాధాన్యమిచ్చినా ఇందిరా ప్రభుత్వంలో రాచరికానికి చెల్లుచీటి ఇచ్చేశారు. కానీ, వారి వారసులకు ప్రజల్లో ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. అందుకే రాజకీయ పార్టీలు సైతం వారిని తమ అభ్యర్థులుగా నిలబెడుతున్నాయి. ఇప్పటికీ ఎన్నికల్లో వారి ప్రాభవం కొనసాగుతోంది. సాధారణంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు లిట్మస్ టెస్ట్‌గా అభివర్ణిస్తారు. అయితే మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకుటుంబాలపై కీలక పార్టీలు ఆధారపడుతుండటం గమనార్హం. 

సతారా 

ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శివేంద్రరాజే భోసలే వరుసగా ఐదోసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. శివేంద్ర తండ్రి అభయసింహరాజే జనతా పార్టీ, కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి ఆరు సార్లు సతారా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో ఎన్సీపీ నుంచి శివేంద్ర బీజేపీలో చేరారు. ఆయన బంధువు ఉదయన్‌రాజే భోసలే (సతారాకు రాజు) సతారా ఎంపీ (బీజేపీ)గా ఉన్నారు. సతారా పొరుగున ఉన్న ఫాల్తాన్ (ఎస్సీ) నియోజకవర్గంలో నాయక్ నింబాల్కర్ రాజవంశానికి చెందిన ఎన్సీపీ నేత దీపక్ చవాన్ అసెంబ్లీ బరిలో ఉన్నారు. 

కొల్హాపూర్

కొల్హాపూర్ నార్త్‌లో ఛత్రపతి సాహూ మహారాజ్ కోడలు, కాంగ్రెస్ ఎంపీ మధురిమరాజే కాంగ్రెస్ తరఫున ఎన్సీపీ (షిండే వర్గం) అభ్యర్థి రాజేశ్ క్షీరసాగర్‌పై పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 4న మధురిమ పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ మాజీ మంత్రి సతేజ్ పాటిల్ బహిరంగంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మధురిమ భర్త మలోజీరాజే 2004లో కొల్హాపూర్ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇండిపెండెం ట్‌గా పోటీ చేస్తున్న రాజేశ్ లత్కర్‌కు మద్దతు ఇవ్వాల్సి రావడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

కాగల్

రాజవంశీకుడైన రాజే సమర్‌జిత్‌సింగ్ ఘట్గే ఎన్సీపీ (ఎస్సీపీ) నుంచి అభ్యర్థిగా నిలబడ్డారు. ఆయనకు ప్రత్యర్థిగా మహారాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి, ఎన్సీపీ (అజిత్ వర్గం) నేత హసన్ ముష్రిఫ్‌పై పోటీ చేస్తున్నారు. సమర్ ను కొల్హాపూర్‌కు చెందిన ఛత్రపతి సాహూ మహారాజ్‌కు కుటుంబం దత్తత తీసుకుంది. 

విదర్భ

గిరిజనులు అధికంగా ఉండే గడ్చిరోలి జిల్లాలో అహేరి రాజకుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ముక్కోణపు పోరులో తలబడుతున్నారు. ఎన్సీపీ మంత్రి ధర్మరావు బాబా ఆత్రమ్, ఆయన కుమార్తె భాగ్యశ్రీ ఆత్రమ్ హల్గేకర్ ఎన్సీపీ (ఎస్సీపీ) పోటీ చేస్తుండగా.. బీజేపీకి చెందిన అంబరీశ్‌రావు ఆత్రమ్ మాత్రం రెబెల్‌గా బరిలోకి దిగారు.