- ప్రయాగ్‌రాజ్‌కు ఆధ్యాత్మిక శోభ
- పుణ్యస్నానం ఆచరించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
- రూ.7వేల కోట్లతో భక్తులకు సౌకర్యాలు
న్యూఢిల్లీ, జనవరి 12: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. పుష్య పౌర్ణమి పర్వది నం సందర్భంగా సోమవారం మహా కుంభమేళాకు అంకురార్పణ జరగనుంది.
ఈ పర్వదినానికి ఉన్న విశిష్ఠత కారణంగా మహాకుంభమేళా ప్రారంభమైన తొలి రోజున గంగ, యమునలతో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడానికి దేశ నలుమూల నుంచి సాధువులు, సాధ్వీలు, నాగ సాధువులు, కల్పవాసీలు భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు.
దీంతో తీర్థరాజ్‌గా పేరొందిన ప్రయాగ్‌రాజ్ శివనామ స్మరణతో మార్మోగుతోంది. 45 రోజల పాటు (ఫిబ్రవరి 26 వరకు) జరిగే ప్రపం చంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండగలో సుమారు 123దేశాలకు చెందిన 40కోట్ల మంది భక్తులు పా ల్గొంటారని అంచనా. ఈ క్రమంలోనే యూ పీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సుమారు రూ.7వేల కోట్లు వెచ్చించి భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసింది.
ఏర్పాట్లు పూర్తి
మహాకుంభమేళా జరిగే ప్రయాగ్‌రాజ్‌ను ప్రభుత్వం సుందరంగా తీర్చిదింది. త్రివేణీ సంగమానికి ఇరువైపులా 4వేల హెక్టార్లున భక్తుల సౌకర్యాల కోసం కేటాయించింది. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6లక్షల తాత్కాలిక గుడారాలను ఏర్పాటు చేసింది. వీటితోపాటు 1.5లక్షల మరుగు దొడ్లను నిర్మించింది. 50వే నీటి కనెక్షన్లతోపాటు 200 వాటర్ ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చింది.
అంతేకాదు 400 కిలోమీటర్ల తాత్కాలిక రోడ్లను ప్రభుత్వం నిర్మించింది. పార్కింగ్ కోసం 1800హెక్టార్లను కేటాయించింది. 12 కిలోమీటర్ల పొడవున తాత్కాలిక ఘాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అశుభ్రతకు చోటు లేకుండా 15వేల మంది శానిటేషన్ సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. భక్తుల భద్రత కోసం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకంది.
సుమారు 30వేల మంది పోలీసులను ప్రయాగ్‌రాజ్‌లో మోహరించింది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం అండర్ వాటర్ డ్రోన్‌లు, 2700 ఏఐ ఆధారిత కెమెరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
స్వచ్ఛమైన గాలికోసం..
నగరాన్ని సందర్శించే కోట్లాది మంది భక్తులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయాగ్‌రాజ్‌లోని పలు ప్రదేశాల్లో యూపీ ప్రభుత్వం దట్టమైన అడవులను అభివృద్ధి చేసింది. గత రెండేళ్లుగా 55వేల చదరపు మీటర్లకుపైగా విస్తిర్ణంలో 63జాతులకు చెందిన 1.20లక్షల చెట్లతో అతిపెద్ద ప్లాంటేషన్ అభివృద్ధి చేసింది. ఇందుకోసం జపాన్ మియావాకీ సాంకేతికను ఉపయోగించింది.
ప్రయాగ్‌రాజ్‌కు 13వేల రైళ్లు
దేశ నలుమూల నుంచి వచ్చే భక్తుల కోసం 3వేల ప్రత్యేక రైళ్లతో కలిపి 13వేల రైళ్లను ప్రయాగ్‌రాజ్‌కు నడపనున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. 9 కీలకమైన రైల్వే స్టేషన్లలో 560 ప్రత్యేక టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. జమ్ముకశ్మీర్‌లోని కత్రా ప్రాంతం నుంచి మూడు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు.
ముఖ్యమైన రోజులు ఇవే
13-01-2025: పుష్య పౌర్ణమి
14-01-2025: మకర సంక్రాంతి
29-01-2025: మౌని అమావాస్య
3-2-2025 వసంత పంచమి
12-2-2025: మాఘ పౌర్ణమి
26-2-2025: మహా శివరాత్రి