శరభాంకుడు మన మాణిక్యాలు
“చాపముగా నహార్యమును జక్రిని బాణముగాగ నారిగా
బావదొరన్ బొనర్చి తలపం ద్రిపురంబుల గాల్పవే మహో
ద్దీపిత తీవ్రకోపమున దేవతలెల్ల నుతింప నాటి విల్
పాపపు ఢిల్లిమీద దెగ బాపగదే శరభాంక లింగమా!”
కాకతీయ సమ్రాట్టు ప్రతాపరుద్రుని ఢిల్లీ పాలకులు బంధించుకుని పోతున్న ఒకానొక ప్రమాద సందర్భంలో భగవంతుడైన ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ శివభక్తి ప్రబోధక మహాకవి శరభాంకుడు చెప్పిన పద్యం ఇది. ఈయనను గురించి ఏకామ్రనాథుడు రచించిన ‘ప్రతాపరుద్ర చరిత్రము’ అనే వచన గ్రంథంలోను, కాసె సర్వప్ప రచించిన ‘సిద్ధేశ్వర చరిత్రము’ అనే ద్విపద గ్రంథంలోను, కూచిమంచి తిమ్మకవి రచించిన ‘సోమదేవ రాజీయము’ అనే పద్య రచనలోను శరభాంకుని ప్రసక్తి కానవస్తుంది. ఈ శరభాంకుని గురించి సాహిత్య చరిత్రకారులు అనేక విశేషాలను అందించారు.
ప్రతాపరుద్రుని మంత్రి
శరభాంకుని రచనగా ప్రసిద్ధి చెందిన ‘శరభాంక లింగమా!’ అన్న మకుటంతో ఉన్న ‘శరభాంక లింగ శతకాన్ని’, దానిలోని విశేషాలను కొందరు చరిత్రకారులు ప్రస్తావించారు. అయితే, అందులోని అనేక పద్యాలు ఎవరో తదనంతర కవులు దీనిలో చేర్చి ఉంటారన్న అభిప్రాయాన్ని కూడా పలువురు వ్యక్తపరిచారు. అనేకమంది తదనంతర కవులు శరభాంకుని కవిగా స్తుతించారు.
17వ శతాబ్దపు చివరి పాదం వాడుగా చెప్పబడే ఎడపాటి ఎర్రయ్య కవి తాను రచించిన ‘మల్హణ చరిత్ర’లోను, అప్పకవి కంటే పూర్వుడైన రాజలింగ కవికూడా తన రచన అయిన ‘కూర్మ పురాణం’లోను శరభాంకుని నుతించారు. ఈ కారణంగా శరభాంకుడు ప్రసిద్ధ కవి అని ఆరుద్ర అభిప్రాయపడ్డారు. శరభాంకుడు కేవలం కవి మాత్రమేగాక ప్రతాపరుద్రుని మంత్రివర్గంలోని వాడనికూడా తెలుస్తున్నది. దీనికి ‘లింగధారణ చంద్రిక’లోని గద్యయే ప్రమాణమని పండితులు అభిప్రాయ పడ్డారు.
“శ్రీమద్యజుశ్శాఖాపస్తంబ సూత్ర కౌశికగోత్ర పవిత్రానాది వీరశైవ భక్త త్రయాంతర్భూతాయ ప్రతాపరుద్ర పృథ్వీశ్వర సంస్థాన మంత్రిశేఖర శరభాంక వంశ సంభూతాయ..” అంటూ ఆ గద్యం సాగుతుంది. ఈ వా క్యాలనుబట్టి శరభాంకుడు కవి మాత్రమేకాక ప్రతాపరుద్రుని మంత్రికూడా అని స్పష్టమవుతుంది. ఈ వాక్యాలను ఉదాహరించిన వావిళ్ల సంస్థవారి శతకంలో “శరభాంకుడు, శివదేవయ్య, విశ్వేశ్వర దేశికులు ముగ్గురూ సోదరులే.
ఈ ముగ్గురూ ప్రతాపరుద్రుని మంత్రులే” అని అభిప్రాయపడ్డారు. కాకపోతే, కాకతీయ చరిత్రకు సంబంధించిన గ్రంథాలలో మాత్రం శిరభాంకుని పేరు కనిపించదని వారంటారు. ఏకామ్రనాథుని ‘ప్రతాప చరిత్రము’లో మాత్రం మంత్రి శవదేవయ్యతోపాటు శరభాంకుణ్ణి కూడా పేర్కొనడాన్ని ప్రమాణంగా చెప్పవచ్చు.
ఏకశిలా నగర వాసి
కాకతీయ ప్రభువైన రెండో ప్రతాపరుద్రుని (1296 కాలం వాడైన ఈ కవి 1240 ప్రాంతంలో జన్మించి ఉంటాడని చరిత్రకారులు భావించారు. పార్వతీ దేవి, శివలింగయ్య దంపతులకు జన్మించిన శరభాంకుడు కౌశిక గోత్రజుడైన వీరశైవ కవి. నాటి ఏకశిలా నగర ప్రాంతానికి చెందిన ఈయన వీరశైవ ప్రతిష్ఠను శైవధర్మాలను దశదిశలా వ్యాపింపజేసే ప్రయత్నంలో భాగంగా ‘శరభాంక లింగమా!’ శతకాన్ని రచించాడు. ఈ కవి వంశంలోనే ‘పాపయారాధ్యుడు’ అనే మరో కవీ జన్మించినట్లు తెలుస్తున్నది. శరభాంకుడు మొదటి పద్యంలోనే తమ గురువైన శ్రీరమనాథుణ్ణి స్తుతిస్తూ
శ్రీరమనాథ మ్రొక్కి జయసిద్ధుల సన్నుతిజేసి భాను చం
ద్రారుణ వహ్నినేత్రునకు నంజలి జేసి తమిన్నుతించి స
త్కార మొనర్ప నొక్క శతకంబు రచించి చిత్తగింపు మీ
సారమనేక దివ్యముని సన్నుత యో శరభాంక లింగమా!’
అనే పద్యం చెప్పాడు. ఈ శరభాంకుడు అష్టసిద్ధులను సాధించిన వ్యక్తియేగాక అప్పుడప్పుడు వాటిని ప్రయోగించి ప్రసిద్ధినొందినాడని, వేములవాడ భీమన వలె శాపానుగ్రహ సమర్థుడనీ కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
రెండు భాగాలుగా ‘శరభాంక శతకం’
శరభాంకుని రచనగా లోకంలో ప్రసిద్ధి చెందింది ‘శరభాంక శతకం’. శివభక్తి ప్రబోధకమైన ఈ శతకం రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగంలో పలు భాషాదోషాలున్న పద్యాలు కనిపించడం గమనార్హం. ఛందస్సంబంధమైన దోషాలూ వున్నట్లు పలువురు పరిశోధకులు గుర్తించారు. ఈ భాగంలో నాలుగు పాదాల పద్యాలతోపాటు అయిదు పాదాల పద్యాలూ ఉన్నాయి. రెండో భాగంలో మాత్రం సర్వశ్రేష్ఠంగా కనిపించే నాలుగు పాదాలున్న పద్యాలే ఉన్నాయి. దీన్నిబట్టి ఎవరో దోషభూయిష్ఠమైన పద్యాలను శతకం మొదటిభాగంలో చేర్చి ఉంటారన్న అభిప్రాయాన్ని ఆరుద్ర వంటి పరిశోధకులు వెలిబుచ్చారు.
“రెండు భాగాలలోని రచనా భేదాలనుబట్టికూడా ఇది ఏక కర్తృకం కాదనడానికి వీలుంది” అని ఆచార్య ఎస్.వి.రామారావు అభిప్రాయ పడ్డారు. దీనినిబట్టి నాలుగు పాదాలున్న పద్యాలనే శరభాంకుడు రచించాడని, అయిదు పాదాల పద్యాలను అంతగా కవిత్వ శక్తి లేని వేరే వారెవరో రచించి, ఇందులో చేర్చి ఉండవచ్చునని ఆరుద్ర భావించారు. బహుశా శరభాంకుడు చెప్పిన నాలుగు పాదాలున్న పద్య శతకంలోని కొన్ని పద్యాలు లుప్తమై పోయి ఉండవచ్చు.
తదనంతరం ఎవరో ఇవి పూరించాలన్న ఆసక్తితో రాశారు కాని వారంతటి ప్రతిభావంతులు కాకపోవడం వల్ల ఈ పద్యాల్లో అనేక దోషాలు చోటుచేసుకుని ఉంటాయని పలువురు పెద్దలు భావించారు. భావ నిగ్రహం లేని పద్యాలు, యతులు ప్రాసలు మొదలైన ఛందో విషయ దోషాలు శరభాంకునివని భావించే నాలుగు పాదాల పద్యాలలో ఎక్కడా కనిపించవు. కనుక, ఈ శతకం ఏక కర్తృత్వం కాకపోవచ్చునన్న పరిశోధకుల ఆలోచన సత్యమే అనిపిస్తుంది.
కీ.శే. బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి తమ చాటు పద్యమణి మంజరి మొదటిభాగంలో ఈ శతకంలోని నాలుగు పద్యాల్ని ఉదాహరించారు. వావిళ్ల సంస్థవారు 1928లో ప్రకటించిన ‘నీతి శతక సంపుటము’లో ఈ శతకాన్ని ఇచ్చారు. అయితే, ప్రభాకరశాస్త్రి ఉదాహరించిన పద్యాల్లోని ప్రౌఢమగాని, పద్యరచనా ప్రతిభగాని ఈ ముద్రిత ప్రతిలోని అనేక పద్యాల్లో కనిపించదు. దీని ముందుమాటలోనూ ముద్రణాధిపతులు భాషా విషయక దోషాలు చాలా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఢిల్లీ పాలకుల బంధ విముక్తి కోసం..
‘శరభాంక లింగమా!’ శతకంలో నాలుగు పాదాలున్న పద్యాలు 60 ఉన్నాయి. అయిదు పాదాలున్న పద్యాలు 40 ఉన్నాయి. ఆరు పాదాలున్న ఒక పద్యమూ ఇందులో చోటు చేసుకుంది. నాలుగు పాదాలు మిక్కిలి ప్రౌఢంగా ఉండగా, వీటిని శరభాంకుడు రాసి ఉంటాడని, మిగతావి ఎవరో అల్ప ప్రతిభులు చేర్చి ఉంటారని సాహిత్యచరిత్రకారుల భావన. శరభాంకుని పద్యాల్లో శివభక్తి, భావపుష్టి, ఊహానిపుణత వంటి సల్లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ వ్యాసం ప్రారంభంలో చెప్పుకున్న “చాపముగా..” అనే పద్యం ఒకానొక క్లిష్ట పరిస్థితిలో పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ చెప్పింది.
ఢిల్లీ పాలకులు తమ రాజైన ప్రతాపరుద్రుణ్ణి బంధించుకొని పోతున్న వేళ రక్షించమని పరమేశ్వరుణ్ణి వేడుకొంటూ, త్రిపురాసుర సంహార ఘట్టాన్ని జ్ఞాపకం చేసే విశేషాలు ఈ పద్యంలో ఉన్నాయి. “ఓ పరమేశ్వరా! నీవు త్రిపురాసురుని సంహరించే సమయంలో ఎలాగైతే మేరు పర్వతాన్ని చాపంగా, విష్ణువునే బాణంగా, సర్పరాజునే వింటి నారిగా చేసుకున్నావో అలాగే, ఆనాటి విల్లుతోనే నేటి ఢిల్లీ పాలకులనూ తెగబార్చువా స్వామీ” అంటూ ప్రార్థించడంలో ఆ భయానక సందర్భాన్ని రాక్షసశక్తి విజృంభణను, దాని కారణంగా జాతి మూలాలు సర్వనాశనమవడం వంటి పలు విషయాలు మన అవగాహనలోకి రావడం శరభాంకుని ఈ పద్యంలోని విశేషం.
గొప్ప యోగం సన్యాసం
యోగుల విషయం వచ్చిన సందర్భంలో ఈ కవి రెండు, మూడు పద్యాలు చెప్పాడు. యోగి ఏ విధంగా ఉండాలో చెప్పడానికి ముందు దొంగయోగులను గురించీ పద్యాలు రచించాడు. దొంగ సన్యాసులు ఆ కాలంలోను ఉన్నట్లు దీన్నిబట్టి మనకు తెలుస్తుంది. దొంగ సన్యాసుల్ని గర్హిస్తూ
“రాగిలి రాత్రులెల్ల రతిరాజ సుఖార్ణవ కేళిదేలి సం
భోగమునందు బొంది తమ పోకడ లోకులెరుంగ కుండగా
వేగమె వేషధారులయి వేరొక రీతి చరించు నావృథా
యోగులు కామినీ జనుల యోగులయా శరభాంక లింగమా!”
అంటూ చెప్పిన పద్యం అటువంటి దొంగ యోగుల బండారాన్ని బయటపెట్టింది.
సన్యాసమనేది ఒక గొప్ప యోగం. కానీ, కొందరు తమ వ్యక్తిగతమైన సుఖాలకోసం దీన్ని ఒక ముసుగుగా ధరించి లోకంలో సంచరిస్తున్నారు. అందుకే, శరభాంకుడు అలాంటి వారు
“దుష్ట కామంతో రాత్రంతా మన్మథకేళిలో గడిపి, తమ ఈ స్థితిని లోకం గుర్తించకుండా సన్యాసుల వేషధారులై సంచరిస్తూ కనిపించే ఈ దొంగలు ‘కామినీ యోగులయ్యా! పరమేశ్వరా!” అని తీవ్రంగా చాటాడు. అసలైన యోగులు ఎట్లా ఉండాలన్నదీ చెప్పాడు.
“వాలిన యింద్రియాలయ
కవాటములన్నియు మూసి నెమ్మదిన్
దాళముబెట్టి లోని పరతత్త మహత్వ త్రికోణ మందిరా
లాలిత నాగకన్య సువలాలను జేసిన యోగి గాక పై
మాళపు వేషముల్ యముని మూర్కొనునా శరభాంక లింగమా!”
అన్న పద్యం నిజమైన యోగి లక్షణాన్ని స్పష్టంగా చెబుతున్నది.
సర్పరూపంలో కుండలిని
“యోగి అయినవాడు తన సమస్త ఇంద్రియాలపై పట్టు సాధించాలి” అంటూ ‘ఇంద్రియాలు అనే ఆలయాల కవాటాలన్నీ మూయాలి” అని కవితాత్మకంగా చెప్పాడు. దానివల్ల మూలాధారం నుంచి సహస్రారానికి వెళ్లే కుండలినిని సర్పరూపం వలె ఉంటుందన్న భావన స్థిరపడింది. దాన్నే ఈ పద్యంలో కవి నాగకన్యగా భావించాడు. అట్లా నిష్ఠతో యోగసాధన చేసిన వాడే నిజమైన యోగి కాని, అన్యులు కాదని శరభాంకుడు స్పష్టంగా చెప్పాడు. ఇటువంటి విలువైన అనేక విశేషాలు ఆ పద్యాల్లో ఉన్నాయి. ఎన్నో లోకజ్ఞాన నీతులు శతకంలోని పలు పద్యాలలో సాక్షాత్కరిస్తాయి.
చక్రవర్తికైనా వర్తించే నియమాలు
“పెట్టక కీర్తి లేదు వలపించక యింతికి నింపులేదు తా
దిట్టక వాదులేదు మరిధీరతవైరుల సంగరంబులన్
గొట్టక పేరులేదు కొడుకొక్కడు లేక వరంబులేదు నా
పట్టపురాజుకైన నిది పద్ధతి శ్రీ శరభాంక లింగమా!”
‘లోకంలోని ప్రతి వ్యక్తికీ కొన్ని అవసరాలను చెబుతూ, అటువంటివి లేని పక్షంలో అందవలసినవేవీ అందవు. రావలసినవేవీ రావు’ అన్నాడు. “కీర్తిని ఆశిస్తే పెట్టడంలో వెనకాడరాదు, ప్రేమించక పోతే స్త్రీ విషయంలో మాధుర్యం లేదు. అనవసరంగా మాట్లాడకపోతే పోట్లాటే లేదు, ధైర్యం చేసి శత్రువులను ఎదిరించకపోతే కీర్తే లేదు, సజ్జనుడైన కొడుకు లేకపోతే వరమే లేదు ఇవి చక్రవర్తికైనా వర్తించే నియమాలే” అంటూ లోకం పోకడలోని గుట్టు విప్పాడు శరభాంకుడు.
శివభక్తిని చాటే పద్యాలు
కవిత్వ విన్యాసాల్లోను శరభాంకుడు ప్రతిభావంతుడేనని చెప్పడానికి సాక్ష్యంగా కొన్ని పద్యాలు ఈ శతకంలో కనిపిస్తాయి.
“పుట్టితి, మర్త్యజన్మమున బుట్టియు
బుట్టి యనేక మార్గముల్
మెట్టితి, మెట్టి యేదియును మెచ్చక
నీ పదపద్మములన్ మదిన్
బట్టితి, బట్టి పాపముల బాపితి
బాపి మహత్వ తత్తముల్
ముట్టితి, ముట్టి తొంటి తుదిముట్టితినో
శరభాంక లింగమా!”
ఇదొక అందమైన ‘ముక్త పదగ్రస్తం’తో కూడిన పద్యం. వాక్యం చివర వదలిపెట్టిన పదం తిరిగి గ్రహించి, తరువాతి వాక్యం ప్రారంభించడాన్ని అలంకార శాస్త్రం ‘ముక్తపద గ్రస్తం’గా చెప్పింది. ఇందులో ‘పుట్టితి పుట్టి, మెట్టితి మెట్టి, పట్టితి పట్టి, ముట్టితి ముట్టి’ అనే నాలుగు పాదాల్లో ముక్త పదగ్రస్తాన్ని గొప్పగా చెప్పిన ఈ కవి, తన శివభక్తి పారమ్యాన్ని కూడా గొప్పగానే చాటుకున్నాడు.
“మానవుని జన్మనందుకుని నేను అనేక మార్గాల్లో సాగి సాగి చివరకు దేన్నీ మెచ్చక నీ పాదాలనే మనసులో పట్టుకొని నా పాపాలను పోగొట్టుకున్నాను. దానివల్ల శివమహత్వ తత్తాలు బోధ పడి పవిత్రుణ్ణయ్యాను” అని చెప్పుకున్నాడు. ఈ విధంగా శివభక్తి ప్రాశస్త్యాన్ని తెలియజేసే పద్యాలెన్నో ఈ శతకంలో కానవస్తాయి.