calender_icon.png 12 October, 2024 | 7:57 AM

మహదేవ్ యాప్ చంద్రకర్ అరెస్ట్

12-10-2024 01:00:33 AM

అదుపులోకి తీసుకున్న దుబాయి పోలీసులు

జ్యూస్ వ్యాపారి నుంచి వేల కోట్ల కుంభకోణం

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ కుంభకోణంలో యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్‌ను దుబాయి పోలీసులు అరెస్టు చేశారు. త్వరలో అతన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

గతేడాది ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ కేసులో ఈడీ అభ్యర్థన మేరకు మనీలాండరింగ్, మోసం కేసుల్లో ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది. దీంతో స్కాంలో భాగమైన మరో ప్రమోటర్ రవి ఉప్పల్‌ను గతేడాదే యూఏఈ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం అతను హౌస్ అరెస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయ్‌కు చెందినవారని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ దుబాయి నుంచి మహదేవ్ బెట్టింగ్ దందా ను నడిపారు. కుంభకోణంపై దర్యాప్తులో చంద్రకర్, రవితో పాటు ఛత్తీస్‌గఢ్ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని ఈడీ వెల్లడించిం ది.

ఇప్పటివరకు ఈ కేసులో 11 మందిని అరెస్టు చేసింది. చంద్రకర్ ఒకప్పుడు జ్యూస్ అమ్ముతూ జీవనం సాగించేవాడు. 2019లో దుబాయి వెళ్లి, అనంతరం ఈ యాప్ ద్వారా రూ.6 వేల కోట్ల నేర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. రవి, చంద్రకర్ మలేసియా, థాయ్‌లాండ్, యూఏఈతోపాటు భారత్‌లో కాల్‌సెంటర్లు ప్రారంభించి దందా నిర్వహించారు.