calender_icon.png 27 September, 2024 | 10:47 PM

మానవాళిని రక్షించే బాధ్యత మీరు తీసుకోండి

26-09-2024 04:13:43 PM

రీజినల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్-2024లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, (విజయక్రాంతి): మీరు చేస్తున్నది ఉద్యోగం అనేది కాకుండా మానవాళిని రక్షించే బాధ్యత తీసుకున్నామని భావించి సమర్థవంతంగా విధులు నిర్వహణ చేయాలని ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న రీజినల్ ఫారెస్ట్ స్పోర్ట్స్ మీట్ -2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించి ఆయన మాట్లాడారు.  గతంలో  గ్లోబల్ వార్మింగ్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం, ఏదో నష్టం జరుగుతుందానుకున్నాం,  ప్రతి సంవత్సరం మన కళ్ళ ముందు జరుగుతుందని, మొన్న కురిసిన భారీ వర్షాలకు గ్లోబల్ వార్మింగ్ కారణమైందని ఆయన చెప్పారు. 

దానివలన  ప్రజాజీవనం అస్తవ్యస్తం అయ్యిందని, భారీగా కురిసిన వర్షాలకు ఇండ్ల లోకి నీరు వచ్చిందని , వీటన్నింటికి ప్రధాన కారణం ఒకటే చెట్లు లేకపోవడమే అన్నారు.  విపరీతంగా అటవీ సంపద  కుంచించుకు పోవడం, అడవుల విస్తీర్ణత తగ్గడం వలన నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.   అడవులను పరిరక్షించాల్సిన బాధ్యత మీపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. అడవినే జీవనాధారంగా చేసుకుని బ్రతికే ఎన్నో తెగలు అడవిలోనే బతుకుతావున్నయని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, ఇలాంటి వాళ్ళ వల్ల నష్టం లేదని, కేవలం స్మగ్లర్లు వల్ల మాత్రమే నష్టం జరుగుతుందని చెప్పారు.  

ఎందరో అడవులను పరిరక్షించే క్రమంలో  తమ ప్రాణాలను సైతం కోల్పోతారని , మీ రక్షణ కోసం ప్రభుత్వాలు కూడా  ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయని, మీ బాగుకోసం ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి గట్టిగా మీరు ఉత్సాహంతో, గతానికి భిన్నంగా మళ్లీ మీరందరూ కూడా ఒకసారి పునరంకితం కావాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.  అడవులకు నష్టం చేసే వారిపైన కఠినంగా వ్యవహరించాలని, మీరు చిత్తశుద్ధి తోటి, బాధ్యత తోటి మీయొక్క డ్యూటీ చేయాలని,  భవిష్యత్తు తరాలకు మన సంపద అందించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఫారెస్ట్ సిబ్బంది అందరూ చాలా చక్కగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అందరూ ఫీట్ నెస్ సాధించాలని అందుకు పరిశ్రమ అవసరమని అన్నారు.

మీ సమస్యలను అన్నివిధాలా పరిష్కారించేందుకు ముఖ్యమంత్రి వరకు తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు  జ్యోతి ప్రజ్వలన,  జెండా ఆవిష్కరణ చేసి క్రీడాకారుల చేత గౌరవ వందనం స్వీకరించారు.  జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిఎఫ్ఓ సత్యనారాయణ, డిఎస్ఓ శ్రీనివాస్, ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, శివప్రసాద్ రెడ్డి, ఏర్పుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.