16-04-2025 07:49:56 PM
దొంగను పట్టుకున్న పోలీసులు..
భారీ చోరీని ఛేదించిన పోలీసులు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): దొంగతనానికి పాల్పడి భారీగా నగదు అపహరించి.. ఆ డబ్బుతో పల్సర్ బైక్, మొబైల్ ఫోన్, రెండు బంగారు ఉంగరాలు, వెండి బ్రాస్లెట్ చేయించుకొని జల్సాగా తిరుగుతున్న దొంగను మహబూబాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఈనెల 8న మహాలక్ష్మి ట్రేడింగ్ కంపెనీలో చోరీకి పాల్పడి 9 లక్షలకు పైగా నగదు అపహరించిన ఘటనను పోలీసులు ఛేదించారు.
ఈ ఘటనకు పాల్పడ్డ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రత్తి రామ్ తండాకు చెందిన గుగులోతు నవీన్ ను బుధవారం అరెస్టు చేశారు. అతని నుండి 5 లక్షల రూపాయల నగదు, కొత్త పల్సర్ బైక్, రెండు బంగారు ఉంగరాలు, ఒక వెండి బ్రాస్లెట్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని దొంగను రిమాండ్ కు పంపినట్లు మహబూబాబాద్ డిఎస్పి తిరుపతిరావు తెలిపారు. దొంగతనం జరిగిన తర్వాత ఈ ఘటనపై మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య, సి సి ఎస్ సిఐ హత్తిరామ్, కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజ్, సిసిఎస్ ఎస్ఐ తాహెర్ బాబా, కరుణాకర్, రామ్ చందర్ విచారణ చేపట్టి దొంగను పట్టుకునే ప్రయత్నంలో భాగంగా పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయగా పాత నేరస్థుడైన నవీన్ పెనుగొండ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వ్యవహరించడంతో అదుపులోకి తీసుకొని విచారణ చేయగా కేసముద్రంలో జరిగిన చోరీ తానే చేసినట్లు అంగీకరించాడని చెప్పారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేక ప్రత్యేకంగా అభినందించారు.