calender_icon.png 26 February, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాశివరాత్రి జాతరకు ఏడుపాయల ముస్తాబు

26-02-2025 12:00:00 AM

ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి

పర్యవేక్షించిన కలెక్టర్

883 మంది పోలీసుల బందోబస్తు

మెదక్ / పాపన్నపేట, ఫిబ్రవరి 25: మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర పరిసర ప్రాంతాలను  వనదుర్గ అమ్మవారి  పరిసర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈనెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా  నిర్వహిస్తున్నట్లు,  భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా  జాతర  నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

జాతర నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. జాతర సందర్భంగా ఎక్కువ బస్సు సర్వీసులు నడపాలని, జాతరకు  ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని  సూచించారు. జాతర సందర్భంగా వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ సదుపాయాలను ఏర్పా టు చేయాలని అన్నారు.

ఆలయ పరిసరంలో అపరిశుభ్రత కాకుండా మూడు షిఫ్ట్ లో పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. జాతర సందర్భంగా వైద్య క్యాంపులు ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యమైన ప్రదేశాలలో అన్ని పందిళ్ళ వద్ద మంటలు ఆర్పే ఫైర్ యంత్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. జాతరను పర్యవేక్షించేందుకు  అన్ని శాఖల అధికారుల నోడల్ ఆఫీసర్ల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, భక్తుల కోసం ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని   సూచించారు. 

150మంది గజ ఈతగాళ్లు...

జాతరలో భక్తులు పుణ్యస్నానాలు చేయనున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మత్స్యశాఖ ఆధ్వర్యంలో 150 మంది గజ ఈతగాళ్ళను ఏర్పాటు చేశారు. అలాగే రెండు అగ్నిమాపక వాహనాలు, ఒక ద్విచక్ర వాహనం ఏర్పాటు చేశారు. పది వైద్య శిబిరాలు, 4 అంబులెన్స్ లు, 251మంది వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 9 సంచార బృందాలు, 2 చెక్ పోస్టులు, 144 త్రాగునీటి నల్లాల యూనిట్లు, 476 శౌచాలయాలు, 12 జల్లు స్నానాలు, 27 ట్యాంకర్లు సిద్ధం చేశారు. అలాగే చెత్త సేకరణ కోసం 598 మంది పారిశుధ్య కార్మికులు 8 ట్రాక్టర్లు, 5 ఆటోలు సిద్ధం చేశారు.

పోలీసు బందోబస్తు...

జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ముగ్గురు డీఎస్పీలు, 20మంది సీఐలు, 61మంది ఎస్త్స్రలు, 45మంది ఏఎస్త్స్రలు, 96మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 301 మంది కానిస్టేబుళ్లు, 91మంది మహిళా కానిస్టేబుళ్లు, 252 మంది హోంగార్డులు, 14మంది మహి ళా హోంగార్డులు మొత్తం 883 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పా టు చేశారని తెలిపారు.