26-02-2025 02:40:55 PM
పటాన్ చెరు,(విజయక్రాంతి): జిల్లాలోనే సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయాన్నే మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. అమీన్ పూర్ మున్సిపల్ ప్రజలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు.
భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తుల కోసం ఆలయ కమిటీ పాలకవర్గం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. మున్సిపల్ అధికారులు భక్తుల కోసం తాగునీటి వసతి, అత్యవసర వైద్య కేంద్రం ఇతర సౌకర్యాలను కల్పించింది. మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఒక్క రోజే సుమారు లక్షకు పైగా భక్తులు వస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తుతో ఆలయ పరిసరాలను, క్యూలైన్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు. అమీన్ పూర్ ర్ మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.