calender_icon.png 18 November, 2024 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా భక్తకవి శ్రీకంఠం

01-07-2024 12:00:00 AM

గన్నమరాజు గిరిజా మనోహర బాబు :

“ధర కృష్ణాచార్యాదిక

పరికల్పిత పదము తాళబంధచ్ఛందో

విరహితమై చూర్ణాఖ్యం

బరగున నిర్యుక్తనామ భాసితమగుచున్‌”

అంటూ సంకీర్తన లక్షణాలను వివరించే సందర్భం లో తాళ్లపాక అన్నమాచార్యుల వారి మనుమడు, తాళ్లపాక చిన్నన్నగా ప్రఖ్యాతుడైన తాళ్లపాక చిన తిరుమలా చార్యుల వారు వచన సంకీర్తనా చార్యుడైన కృష్ణమాచార్యుల వారి ప్రసక్తిని తీసుకొని వచ్చాడు.

తెలుగులో తొలి వచన సంకీర్తనలు

ఈ కృష్ణమాచార్యుల గృహనామమే శ్రీకంఠం. ఈయన వచనాలలో సింహగిరి నరసింహస్వామిని స్తుతిస్తూ ‘సింహగిరి వచనములు’ రచించాడు. తెలుగులో తొలి రచన సంకీర్తనాచార్యునిగా చరిత్రకారులు గుర్తించిన ఆచార్యుల వారు కాకతీయ పాలకుడైన రెండవ ప్రతాపరుద్రుని కాలం వానిగా నిర్ధారించారు. ఈయన ప్రసక్తి ఏకామ్రనాథుడు రచించిన ప్రతాపచరిత్రలో కనిపిస్తుంది. ఈయన ‘తెలుగులో తొలి వచనైక రచనలు చేసి న ప్రథమ సంకీర్తనా చార్యుని’గా ఆచార్య ఎస్.వి.రామారావు అభిప్రాయపడ్డారు.

శ్రీకంఠం కృష్ణమాచార్యుల వారిని గురించి సుప్రసిద్ధ సాహితీవేత్త డా. తిమ్మావఝుల కోదండరామ య్య, సమగ్రాంధ్ర సాహిత్యకర్త ఆరుద్ర, ప్రముఖ సారస్వతమూర్తి నిడుదవోలు వెంకటరావు, సాహిత్య పరిశో ధకులు డా.వేటూరి ఆనందమూర్తి వంటి పెద్దలెందరో పరిశోధనలు చేశారు. ‘ప్రతాప చరిత్ర’, ‘సింహగిరి వచనాల’ నుబట్టి వీరి జన్మస్థలం ‘సంతూరని’, అక్కడి ఒక శ్రీవైష్ణవ కుటుంబంలో ఈయన జన్మించినాడని, ఆచార్యుల వారు పుట్టి గ్రుడ్డివాడైనా నరసింహస్వామి అను గ్రహం వల్ల దృష్టి పొందగలిగాడని పేర్కొన్నారు.

నాలుగు లక్షల వచనాలు

సింహాచల నరసింహస్వామిని కీర్తిస్తూ ఆచార్యుల వారు 4 లక్షల భక్తిపూరిత వచనాలు రాసినట్లు తెలుస్తున్నది. కాని, అవన్నీ లభించక పోవడం తెలుగువారి దుర దృష్టం. కృష్ణమాచార్యుల జన్మస్థలాన్ని గురించి కూడా పలువురు సాహిత్య విమర్శకులు, చరిత్రకారులు చర్చించారు. ‘సింహగిరి వచనముల’ను సంస్కరించి ఒక ప్రత్యే క గ్రంథంగా వెలువరించిన గ్రంథ సంపాదకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు ఆచా ర్య మడుపు కులశేఖరరావు దీనికి విపులమైన పీఠిక రాస్తూ, కృష్ణమాచార్యుల వారి జన్మస్థలం నేటి మహబూబ్‌నగర్ జిల్లాలోగల సంతవూరు అనే గ్రామం అయి వుండవచ్చునని పేర్కొన్నారు.

వారు “మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక గ్రా మం సంతవూరు అనునది కలదు. అది మిక్కిలి ప్రాచీన గ్రామమని స్థానిక చరిత్రవలన తెలియుచున్నది. వడ్డెమాను మొదలైన ప్రాంతా లు కాకతీయ ప్రాంతంలో చేరినట్టివి ఈ జిల్లాలోనే కలవు. కల్లూరునూ ఈ జిల్లాలోనే ఉన్నది. సంతవూరు అను గృహ నామముకల వైష్ణవులు ఈ జిల్లాలో ఇప్పటికినీ ఉన్నారు. కృష్ణమాచార్యులు ఈ ప్రాంతమునకే చెందినవాడనిపై విశేషములు ధ్రువీకరించుచున్నవి అంటూ పలు ప్రమాణాలను వివరించి నిర్ధారించారు. కాకతీయ ప్రతాపరుద్రునిచే 50 గ్రామాలపై అధికారా న్ని వీరు పొందారు. కల్లూరు గ్రామ నిర్మాణం చేశారు.

అంధత్వం నుండి విముక్తి

సింహాచల నృసింహస్వామి అనుగ్రహం కారణంగా నృసింహోపాసకుడైన ఆచార్యుల వారు తమ అంధ త్వం నుండి విముక్తుడైనందువల్ల ‘సింహగిరి నరహరి వచనము’లను పేర వచన సంకీర్తనలు రచించాడని తెలియుచున్నది. తన 16వ ఏట పరాభవ ఆషాఢ శుద్ధ ద్వాదశి (24.6.1306) నాడు నృసింహస్వామి ఆదేశాన్ని అనుసరించి ఈ కృతిని రచించినట్లు ప్రాచీన గ్రంథాలను పరిశోధించడం వల్ల తెలియుచున్నదని ఆరుద్ర పేర్కొన్నారు. అంటే, 14వ శతాబ్దపు తొలి దశకంలో ఈ రచన వెలువడి ఉండవచ్చు. 

వీరి వచన సంకీర్తనలు రాగిరేకులపైనే అధికంగా రాయబడ్డాయి. కేవలం 300 లోపు మాత్రమే లభ్యమవుతున్నట్లు తెలుస్తున్నది. డా.తిమ్మావఝుల వారు, ‘కృష్ణమాచార్యుల వారు సింహాచల ప్రాంతం వాడై ఉండవచ్చునని’ అనేకమైన ఆకరాలను ప్రతిపాదించారు. కాని, ఆరుద్ర వాటిని క్షుణ్ణంగా చర్చించి ఆచార్య కులశేఖరరావు అభిప్రాయాన్నే సమర్థించారు.

చూర్ణిక లక్షణాలు

వచనంలో సంకీర్తనలు రాయడం చాలా అరుదైన విషయం. అసలు ప్రత్యేక వచన రచనలు కృష్ణమాచార్యుల వారితోనే ప్రారంభమైనాయి. సంస్కృత భాషలో శ్రీవైష్ణవ సంప్రదాయానికి చెందిన శ్రీమద్రామానుజుల వారి ‘శ్రీరంగ గద్య’, ‘శరణాగతి గద్య’, ‘రఘువీర గద్య’ వంటి రచనలు అప్పటికే ఉన్నాయి. కాని తెలుగులో ఇటువంటి రచనలు లేవు. రెండవ ప్రతాపరు ద్రుని కాలం (1286 వాడైన శ్రీకంఠం కృష్ణమాచార్యుల వారే ‘వచన వాజ్మయ ప్రథమాచార్యుని’గా నిలిచారు.

సాధారణంగా శాస్త్రవేత్తలు అనంతుడు తన అనంతచ్ఛందంలో, వార్తాకవి రాఘవయ్య తన లక్షణదీపికలో గద్యాన్ని ఐదు విధాలైన గద్యాలుగా విభజించి వాటికి లక్షణాలను వివరించారు. గద్య, వీరగద్య, చూర్ణిక, వచనము, విన్నపము అన్న ఈ ఐదు విధాలైన గద్యాల్లో ఆచార్యులవారి ‘సింహగిరి వచనము’లలోని గద్యాలు ‘చూర్ణిక’ లక్షణాలు గలవిగా సాహిత్యకారులు అభిప్రాయపడ్డారు. చంపూ కావ్యాలు గద్య పద్యాత్మకాలు. అప్పటి వరకు చంపూ కావ్యాల్లో,  ఆశ్వాసాంతాల్లోనే గద్యం ఉండేది. ఈ పద్ధతి నన్నయ కాలం నుండే ఉన్న సంప్రదాయం. సంస్కృత సాహిత్యంలో ‘కాదంబరి’, ‘హర్షచరిత్రమ్’, ‘దశకుమార చరితమ్’ వంటి ప్రత్యేక గద్య రచనలు వుండేవి. కాళిదాసు వంటి మహాకవుల సరసన ఈ గద్య కావ్య రచయితలైన బాణుడు, దండి వంటి మహాకవులకు స్థానం లభించింది. కాని, తెలుగు లో కృష్ణమాచార్యుల వారితోనే ఈ రచనా సంప్రదా యం ప్రారంభమైంది.

ఏకామ్రనాథుని ‘ప్రతాప చరిత్ర’లో వివరంగా చెప్పబడిన కృష్ణమాచార్య కృతి వివరాలకు పూర్వం గద్య కావ్యం లేదన్న సంగతి తెలిసిందే. అయితే, వచనమనే అంశంలో మహా పండితులైన వారు నాటి రాజసభలలో ఉండేవారని నన్నయ చెప్పినట్టు ‘నవార్థ వచన విశారదు’లైన వారు, ‘మృదుమధుర రసభావ భాసురా లు’ అందించే పండితులు వుండేవారని తెలుస్తున్న ది. కాని, ప్రత్యేక గద్య కావ్యాలు లేవన్న విషయం మాత్రం స్పష్టంగా బోధపడుతున్నది.

గేయ సంకీర్తనాకారులకు మార్గదర్శి

శ్రీకంఠం కృష్ణమాచార్యులు రచించిన వచన సంకీర్తనలే తదనంతర గేయ సంకీర్తనా కారులకు కూడా మార్గదర్శకాలై నిలుస్తున్నాయి. అన్నమాచార్యాది సంకీర్తనాచార్యులకు ఈ రచన ఒజ్జబంతిగా నిలిచిందని సాహిత్య చరిత్రకారులు భావించారు. మనం చెప్పుకు న్న తాళ్లపాక చిన్నన్న రాసిన పద్యం అన్నమయ్యే రాశాడని, అయితే ఆయన ఈ విషయాన్ని సంస్కృతంలో రాస్తే మనుమడు తెలుగులో రాశాడని పెద్దలు నిడుదవోలు వెంకటరావు భావించారు.

సింహగిరి నరహరి నమో నమో దయానిధీ!

‘సింహగిరి నరహరి వచనాల’లో ప్రతి వచనం చివ ర్లో ‘సింహగిరి నరహరి నమో నమో దయానిధీ’ అన్న మకుటం కూడా ఉంటుంది. శతక లక్షణమైన ‘మకుటం’ కనిపించడం ఈ వచన సంకీర్తనల ప్రత్యేకత. అయితే, శతకాలు బహు విషయ సమన్వితాలు. ఈ వచనాలు మాత్రం కేవలం విష్ణుపారమ్య విశేషాలకు పరిమితాలు. భక్తి పూరితాలు. ఇందులో విప్రనారాయణుడు, అరుంధతి, అజామీడుడు, అంబరీషుడు, వీరభోగ వసంత రాయలు వంటి విష్ణుభక్తుల కథలతోపాటు వేదాంత విషయాలు, రామాయణాది మహా పురాణ విశేషాలుకూడా పొందు పరుపబడ్డాయి. కొన్ని వచనాలు తాళ లయాన్వితాలై భజన కీర్తనల్లాగా కూడా భాసిస్తాయి. అనేక వ్యావహారిక భాషా పదాలకు ఈ రచనా స్థానాన్ని కల్పించింది.

“దేవా!

పది కోట్ల యజ్ఞాది క్రతువులు నడుపంగానేమి

తొమ్మిది కోట్ల తులాభారంబులు తూగగానేమి

యెనిమిది కోట్ల సువర్ణ దానంబులు సేయంగానేమి

యేడు కోట్ల గోదానంబులు సేయంగానేమి

ఆరు కోట్ల భూదానంబులు సేయంగానేమి.. ”

అంటూ ఒక పెద్ద వచన సంకీర్తనం చేస్తూ ‘మీ నామోచ్ఛారణము సేయక’ ఇవన్నీ వృథాయన్న భావా న్ని వెలిబుచ్చాడు కవి. 

ఈ ‘సింహగిరి వచనముల’ ప్రతి ఒకటి ‘విష్ణునామ సంకీర్తన ఫలము’ అనే పేరుతో తంజావూరు సరస్వతీ మహల్‌లో ఉన్నట్లుగా ఆరుద్ర పేర్కొన్నారు. నిజంగా ఇందులోని అన్ని సంకీర్తనలు కూడా విష్ణునామ ఫలా న్ని తెలిపేవి కనుక ఈ నామాంతరం కూడా దీనికి వచ్చి ఉండవచ్చును. ఆ విషయాన్నే ఆచార్యుల వారు..

“... నీ నామోచ్చారణంబు చేసిన ప్రహ్లాద, నారద, పుండరీక, వ్యాస, శుక, శౌనక, భీష్మ, దాల్భ్య, రుక్మాంగద, అర్జున, బలి, విభీషణ, భృగు, అక్రూర, విదురా దులగు పరమ భాగవతోత్తములు నారాయణ స్మరణ వలన కృతార్థులైరి గావున యతి రామానుజ ముని పరందాతారు అనాధ పతియైన సింహగిరి నరహరి ‘నమో నమో! దయానిధీ”

అంటూ మరొకసారి విష్ణుభక్తి తాదాత్మ్యమన్నది మనిషిని మహా పురుషుణ్ణిగా చేస్తుందన్న కవి భావనను తెలుపుతున్నది.

మరిన్ని ఆధ్యాత్మిక రచనలు

తదనంతర కవులకు స్ఫూర్తినిచ్చిన శ్రీకంఠం కృష్ణమాచార్యుల వారు కేవలం ‘సింహగిరి వచనము’లే గాక విష్ణునామ సంకీర్తనలుగా పిలువబడే ఒక సంబోధన స్తోత్రాన్ని, రామనామాలు, నృసింహ నామాలు, శఠకోప యతి విన్నపాలు వంటి ఇతర రచనలు కూడా చేసినట్లు కొందరు సాహిత్య చరిత్రకారులు పేర్కొన్నారు. ‘రామాయణ కథా గేయాలు’ కూడా ఆచార్యుల వారి రచనే అని పేర్కొంటున్నారు. ఒకవేళ ఆ విషయం ప్రామాణికంగా నిర్ధారింపబడితే కృష్ణమాచార్యుల వారే తొట్టతొలి తెలుగు గేయ సంకీర్తనా చార్యుడన్న కీర్తిని పొందుతాడు. భక్తిరస పారమ్యంతో రచించిన వీరి వచన సంకీర్తనలు తెలుగు సాహిత్యంలో శాశ్వతమైన స్థానాన్ని అందుకున్న గొప్ప రచనలు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

సమభావనా దృష్టి

“విష్ణుభక్తి లేని విద్వాంసుని కంటెను

హరి కీర్తనము సేయు నతడే కులజుండు

శ్వప చుండైననేమి? ఏ వర్ణంబైన నేమి?

ద్విజునికంటే నతడె కులజుండు..”

అన్న వచన సంకీర్తన ద్వారా కృష్ణమాచార్యుల వారి మానవత్వ దృష్టి, సమభావన దృష్టి, సామాజిక చింతన వంటి అనేక విషయాలు అవగతమవుతాయి. అంతేకాదు, పోతన్న రచించిన భాగవతంలోని ప్రహ్లాదుని పలుకులు గుర్తొస్తాయి. అదే విధంగా అన్నమాచార్యుల వారు రచించిన ‘ఏ కులజుడై ననేమి, ఎవ్వడైన నేమి, ఆ కడనాతడె హరి నెఱిగిన వాడు” అన్న కవితకూడా స్ఫురిస్తుం ది. అంటే కృష్ణమాచార్యుల వారి వైష్ణవ భావ న తదనంతర కవులకు గొప్ప స్ఫూర్తినిచ్చింద ని భావించవచ్చు. ఆయన కీర్తనలన్నీ వచనంలో ఉంటే తాళ్లపాక అన్నమయ్యవి గేయ సంకీర్తనలు. కాని, పలు తావుల్లో ఈయన భావ స్ఫూర్తి కనిపించడమే విశేషం.

వ్యాసకర్త సెల్: 9949013448