11-03-2025 12:43:11 AM
భద్రాద్రి కొత్తగూడెం మార్చి10 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలోని ఓ ఇంటి నెంబర్ బాగోతం తవ్వినా కొద్ది అక్రమాలు వెలుగు చూస్తోంది. వాస్త వంగా ఇంటి నెంబర్ పొందాలంటే తప్పనిసరిగా గోడలు ఉండాలి, అసంపూర్తిగా అన్న ఇంటికి నెంబర్ పొందటమే కాదు, ఆస్తి బదలాయింపు (రిజిస్ట్రేషన్ )లోను పలు అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.
మున్సిపాలిటీలో ఇంటి నెంబర్ 8-1-192/1/A/1 పొందిన కే ఎస్ పి రోడ్ లో గజం భూమి మార్కెట్ విలువ రూ 9,500 గా ప్రభుత్వ నిర్ధారించింది. ఆ ఇంటి నెంబర్ పొందిన స్థలం 110.66 గజాలు ఉంది. ఆ లెక్కన ప్రభుత్వం నిర్ధారించిన మార్కెట్ విలువ రూ 10.52 లక్షలు. ఆ ప్రదేశంలో 100 గజాలు ఆర్ సి సి బిల్డింగుగా చూపారు. దాని ప్రకారం రూ 1.10 లక్షలు , మొత్తం మార్కెట్ విలువ రూ 11.62 లక్షలు. ఆ లెక్క ప్రకారం ప్రభుత్వానికి రూ 85 వేలు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంది.
కానీ ఆ అక్రమార్కులు తప్పుడు ఇంటి నెంబర్ ఇంటి నెంబర్ ఆధారంగా స్టాంపు డ్యూటీ రుసుం రూ 30,975, ట్రాన్స్ఫర్ డ్యూటీ రుసుం రూ.8,475, రిజిస్ట్రేషన్ ఫీజు రూ 2,825, కార్డు యూజర్ చార్జెస్ కింద రూ 500, మ్యూటేషన్ ఫీస్ రూ 1000 మొత్తం రూ 43,775 మాత్రమే చెల్లించారు. అంటే సగానికి సగం వ్యత్యాసం తలెత్తింది. అందుకు సబ రిజిస్టార్లు కార్యాలయంలో డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వెలబడుతున్నాయి. స్థలం పక్కన ఉన్న ఇంటి నెంబర్ కాకుండా, వెనక వైపు ఉన్న ఇంటి నెంబర్ వేసి ఈ అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది.
అంతేకాదు స్థలం హద్దుల్లో దక్షిణం వైపు ఉన్న రోడ్డు 30 అడుగులు ఉండాలి. అంటే సగభాగం నుంచి 15 అడుగులు తీసిన తర్వాత భవన నిర్మాణం చేపట్టాలి. భవన నిర్మాణంలోనూ అక్రమాలే. అంతేకాదు అసలు ఆ భవన నిర్మాణానికి పర్మిషన్ కూడా లేనట్టు తెలుస్తోంది. తూర్పున కేఎస్పి రోడ్డు అని హద్దుల్లో చూపారు. కేఎస్పీ రోడ్ లో గజం విలువ రూ 9,500 ఉంది. అంటే ఆ స్థలం యజమాని అనేక అక్రమాలకు పాల్పడినట్లు తేట తేలమవుతుంది.
ఈ విషయమై సబ్ రిజిస్టర్ వేణు మాధవను వివరణ కోరగా మున్సిపల్ అధికారులు ఇచ్చిన ఇంటి నెంబర్ ఆధారంగానే మార్కెట్ విలువ కట్టి చలానా తీసుకున్నామని ఏదైనా ఉంటే మున్సిపాలిటీ వాళ్ళదే తప్ప, తమ తప్పిదము ఏమీ లేదంటూ తప్పుకుంటున్నారు. రూ 9,500 మార్కెట్ విలువ ఉన్న ప్రాంతంలో, రూ 4,100 గా ఎలా నిర్ధారించారని ప్రశ్నించగా సమాధానం లేదు. ఈ విషయాన్ని జిల్లా రిజిస్టర్ అధికారి రవీందర్ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.