calender_icon.png 2 October, 2024 | 8:00 AM

హస్తకళల మాగాణి పెంబర్తి

02-10-2024 12:00:00 AM

జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామం. ఈ పేరు చెబితే చాలు ఎప్పుడో కాకతీయుల కాలం నాటి కళలు కళ్లముందు కదలాడుతాయి. కాలానుగుణంగా తయారయ్యే గొప్ప హస్తకళలు మనసు దోచేస్తాయి. నంది అవార్డుల తయారీ, దేవుని ప్రతిరూపాలు, ధ్వజస్తంభం తొడుగులు, పెళ్లిలోవాడే అనేక కళారూపాలు ఇక్కడే తయారవుతాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో ఈ కళకు బాగా డిమాండ్ ఉందంటే పెంబర్తి ప్రస్థానం ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. 

అవన్నీ పంచలోహాలే.. కానీ హస్తకళాకారుల చేతిలో ఆ లోహాలు అద్భుతమైన రూపాలను సంతరించుకుంటాయి. సాక్షాత్తు దేవుడే కళ్లముందు  ప్రత్యక్షమయ్యాడా? అనే అనుభూతిని కలిగించేలా దేవతామూర్తుల ప్రతిమలు ఆకట్టుకుంటాయి. జనగామ మండలంలోని పెంబర్తి గ్రామం హస్తకళల క్షేత్రంగా విరాజిల్లుతూ మన ఖ్యాతిని ఖండాంతరాలను దాటిస్తోంది.

ఇక్కడి విశ్వకర్మలు రాగి, ఇత్తడి, వెండి, కంచు, బంగారం వంటి లోహాలతో కనులను కట్టిపడేసే వస్తువులను తయారుచేస్తూ ఈ ప్రాంతానికి ఎక్కడాలేని గుర్తింపును తీసుకొస్తున్నారు. పెంబర్తి హస్తకళాకారులు అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, నాటి ప్రధానులు ఇందిరాగాంధీ, పీవీ నర్సింహరావుతో పాటు నాటి ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి లాంటివారికి ఇక్కడ తయారైన వస్తువులను అందజేశారు.

వాటిని చూసి ఆ ప్రముఖులు మంత్రముగ్ధులయ్యారు. దేవతామూర్తుల ప్రతిమలు, నగిశీలు, కిరీటాలు, ధ్వజస్తంభాలు, మకర తోరణాలు, షీల్డులు, పతకాలు, దర్వాజ తొడుగులు, రథాల అలంకరణలతో పాటు అనేక ఆధ్మాత్మిక కళారూపాలు ఇక్కడ తయారవుతాయి. సత్యనారాయణ స్వామి వ్రతం పీటలు ఎక్కువగా అమ్ముడుపోతుంటాయి.

విశ్వకర్మలు తయారుచేసిన కళారూపాల్లో పికాకో బెడ్ ల్యాంప్ (నెమలి రూపం) అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇది చాలా నైపుణ్యం ఉన్న కళాకారుల చేతిలో మాత్రమే రూపుదిద్దుకుంటుంది. ఇక్కడ తయారయ్యే వస్తువులను కొనుగోలు చేసేందుకు వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ఇక్కడికి వస్తుండటంతో పెంబర్తిని 2023 సంవత్సరానికి కేంద్ర టూరిజం శాఖ పెంబర్తిని ‘ఉత్తమ పర్యాటక’ ప్రాంతంగా గుర్తించింది.

విదేశాల్లోనూ ఫుల్ క్రేజ్

పెంబర్తిలో తయారయ్యే నగిశీలతోపాటు వివిధ వస్తువులకు మన దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ బాగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇక్కడ తయరయ్యే కళారూపాలు అమెరికా, జపాన్, జర్మనీకి వెళ్తుంటాయి. అమెరికాలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఇత్తడి ద్వారాలు, ధ్వజస్తంభాలు పెంబర్తి నుంచి వెళ్లినవే. దుబాయ్‌లోని మక్కా మదీనాలో కూడా పెంబర్తి మెటీరియల్‌నే వాడారు. బెల్జియం, సింగపూర్, దుబాయ్‌లోనూ పెంబర్తి కళారూపాలు చోటు దక్కించుకున్నాయి. అంతేకాదు.. సినీ నటులకు ఇచ్చే హంస, నంది అవార్డులు పెంబర్తి విశ్వకర్మల చేతిలో తయారైనవే కావడం విశేషం.

నాటి కళ నేటికీ

కాకతీయ వంశకాలం నుంచి పెంబర్తి హస్తళలు, లోహపు పనులకు ప్రసిద్ధి. కంచు కళా వైభవానికి పుట్టినిల్లు పెంబర్తి. గొప్ప కళాఖండ గ్రామంగా ప్రపంచపటంలోనే పేరుంది. సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, గృహ అలంకరణ, హస్తకళారూపాలను ప్రతిబింబించే విధంగా పెంబర్తి కళారూపాలు రూపుదిద్దుకుంటాయి. అయితే కాకతీయుల తర్వాత నవాబుల కాలంలో ఈ కళను ప్రభువులు బాగా ఆదరించి జీవం పోశారు. ఆనాటి నుంచి నేటివరకు పెంబర్తి కళకు ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ లభిస్తోంది. 

వారసత్వంగా పొందుతూ

ఎంతో ప్రాచుర్యం పొందిన పెంబర్తి హస్తకళారంగ క్రమంగా కనుమరుగవుతోంది. గ్రామంలో సుమారు 150 కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవించగా.. క్రమంగా ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది. శతాబ్దాల నుంచి వస్తున్న హస్తకళను ఒక్కోతరం వారసత్వంగా పొందుతూ కళను నిలబెడుతోంది. కానీ ప్రస్తుత యువత ఈ కళపై ఆసక్తి చూపడం లేదని కళాకారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి సరైన  ప్రోత్సాహం లేక ఈ వృత్తిని చాలామంది వీడుతున్నారని విశ్వకర్మ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 బొమ్మగాని శ్రీకాంత్‌గౌడ్, జనగామ 

విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

ప్రభుత్వాల ఆదరణ లేక విశ్వకర్మలు ఈ వృత్తిని విడిచి వేరే పనులు చేసుకుంటున్నారు. విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి హస్తకళలను ఆదుకోవాలి. వడ్డీ లేని రుణాలిచ్చి విశ్వకర్మలను ప్రోత్సాహించాలి. శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి యువతను హస్త కళాకారులుగా మార్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. అప్పుడే మరిన్ని కళారూపాలను తయారుచేయడానికి అవకాశం ఉంటుంది.

అయిలా మాధవాచారి, విశ్వకర్మ కళాకారుడు