25-03-2025 12:00:00 AM
‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది ‘మ్యాడ్ స్క్వేర్’. నార్నె నితిన్, సంగీత్‌శోభన్, రామ్‌నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్‌శంకర్ దర్శకుడు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా మార్చి 28న విడుదల కానున్న నేపథ్యంలో మ్యాడ్‌గ్యాంగ్ తాజాగా మీడియాతో సమావేశం సందర్భంగా ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలిచ్చింది. “మ్యాడ్’ మాకెంతో స్పెషల్. మా ముగ్గురి కాంబినేషన్ మ్యాడ్ వరకే ఆ ప్రత్యేకం. ‘మ్యాడ్ స్క్వేర్’కు మెయిన్ హీరో వినోదమే. అదే సినిమాను నడిపిస్తుంది. ‘మ్యాడ్’తో పోలిస్తే ‘మ్యాడ్‌స్క్వేర్’లో కామెడీ ఎక్కువుంటుంది.
ఈసారి అశోక్ (నార్నె నితిన్), మనోజ్ (రామ్‌నితిన్) పాత్రలు కూడా ఎక్కువ వినోదాన్ని పంచుతాయి. మ్యాడ్ విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో మ్యాడ్‌స్క్వేర్‌ను ఆడుతూపాడుతూ చేశాం. మ్యాడ్ షూటింగ్ పూర్తవుతున్న సమయంలో మంచి టీమ్‌ను మిస్సవుతున్నామనే బాధ ఉండేది. కానీ, సినిమా విడుదలై పెద్ద హిట్ అవ్వడం, వెంటనే సీక్వెల్ అనడంతో.. చాలా ఆనందపడ్డాం.
మొదటి భాగానికి కొనసాగింపుగా హీరోయిన్ పాత్రలు మా జీవితాల్లో ఉంటాయి. కానీ, వారు తెర మీద కనిపించరు. ‘మ్యాడ్’ విజయానికి కారణం వినోదం. అదే మా బలం. దాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి వినోదభరిత చిత్రంగా ‘మ్యాడ్‌స్క్వేర్’ను మలిచాం.
ఇందులో కామెడీ పూర్తి కొత్తగా ఉంటుంది. మ్యాడ్‌లో కంటే మ్యాడ్‌స్క్వేర్‌లో లడ్డు పాత్ర మరింత కామెడీగా ఉంటుంది. మేము ముగ్గురం కలిసి లడ్డును ఫుల్‌గా ఆడుకుంటాం. మ్యాడ్ ఫ్రాంచైజ్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. కానీ, వెంటనే కాదు. విరామం ఇచ్చి చేయాలి.