calender_icon.png 22 October, 2024 | 11:38 PM

మేడిగడ్డ భయం!

07-08-2024 02:21:03 AM

రివర్స్ పంపింగ్!

  1. బరాజ్ పిల్లర్లు కుంగిపోవడంతో కాళేశ్వరం ఇంజినీర్ల ఆందోళన
  2. ఎప్పుడేం జరుగుతుందోనని అధికారుల్లో గుబులు
  3. ఎలాగైనా బదిలీ చేయించుకోవాలని విశ్వప్రయత్నాలు 
  4. బదిలీలపై నిషేధం ఉన్నా మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ?

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ కల్పతరువులా ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మొన్నటి వరకు ప్రశంసలు పొందిన ఇంజినీర్లు, అధికారులకు నేడు మేడిగడ్డ గుబులు పట్టుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాక్‌లోని రెండు పిల్లర్లు కుంగిపోవడంపై రోజురోజుకూ మారుతున్న పరిణామాలతో ఆందోళనకు గురవుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్ని కల సమయంలో బరాజ్‌లోని రెండు పిల్లర్లు కుంగడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పుపట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, ప్రాజెక్టు మొత్తం కమీషన్‌ల కోసమే నిర్మించారంటూ ప్రచారం చేశారు.

అయితే, అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నాయకుల ప్రచారాన్ని తిప్పికొట్టారు. కావాలనే ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారంటూ ఎదురుదాడి చేశారు. కానీ, ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పరాజయం పాలై  కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరితే ప్రాజెక్టు కుంగిన వ్యవహారంలో తమ పరిస్థితి ఏంటనే ఆందోళ నలు ఎన్నికల సమయం నుంచే అధికారులు, ఇంజినీర్లలో నెలకొంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల తర్వాత నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. బరాజ్‌ను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ బృందం, న్యాయ విచారణ సభ్యులతోపాటు గత మే 6న జ్యూడీషియల్ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ సందర్శించారు. ఈ క్రమంలో ప్రాజెక్టుపై 

 నిపుణుల బృందా ల నివేదికలు ప్రాజెక్టు ఇంజినీర్లు, అధికారులకు మరింత ఆందోళనకు గురిచేస్తు న్నాయి. ప్రాజెక్టు నిర్మాణ దశలో పనిచేసిన అధికారులు, ఇంజినీర్లలో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయం నెలకొంది.

బదిలీ చేయించండి సారూ! 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలో పనిచేసిన అధికారులు, ఇంజినీర్లు తమను ఇక్కడి నుంచి వేరే చోటుకి బదిలీ చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులకు విజ్ఞప్తులు చేస్తూ వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు తెలిసింది. అయితే, ఇక్కడి నుంచి మరోచోటికి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే కాస్త రిలీఫ్ అయ్యే అవకాశముంటుందన్న ఆలోచనలో అధికారులు, ఇంజినీర్లు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇటీవల ప్రభుత్వం  బదిలీల ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో తమను సైతం బదిలీ చేయాలంటూ ప్రాజెక్టు అధికారులు, ఇంజినీర్లు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. కానీ, వాన కాలం సీజన్ ముగిసే వరకు ఇరిగేషన్, వ్యవసాయశాఖ అధికారులను బదిలీ చేయవద్దని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయినా ప్రాజెక్టు ఇంజినీర్లు, అధికారులు బదిలీల కోసం తమకు పరిచయం ఉన్న లీడర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది.

అయితే, ఎన్నికల సమయంలో ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయిన తర్వాత నుంచే అధికారులు బదిలీల ప్రయత్నాలు చేసినప్పటికి ఫలించలేదు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అధికారులు, ఇంజినీర్లకు మరింత గుబులు పుట్టింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని భావించిన అధికారులు ఎంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్తే అంత బాగుంటుందని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఇదిలా ఉండగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రిన్సిపల్ సెషన్ జడ్జి కోర్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహ తొమ్మిది మందికి నోటీస్‌లు జారీ చేయడంతో అధికారులు, ఇంజనీర్లకు మరింత దడ పుట్టిస్తోంది. ప్రాజెక్టు కుంగిన వ్యవహరం ఎటు దారితీస్తుందోననే భయం పట్టుకుంది. ఎలాగైనా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మరో ప్రాజెక్టుకు వెళ్లిపోవాలనే తమ తమ ప్రయత్నాల్లో ప్రాజెక్టు ఇంజినీర్లు, అధికారులు ఉన్నట్టు సమాచారం.