calender_icon.png 26 November, 2024 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలోనే మేడిగడ్డ డ్యామేజీ!

18-05-2024 12:34:01 AM

నీటిని నింపిన సమయంలోనే బరాజ్‌కు నష్టం 

మరమ్మతులు చేయకుండా వదిలేసిన సర్కారు

అందువల్లనే గత ఏడాది ఒక్కసారిగా కుంగుబాటు 

నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల వెల్లడి

ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేత 

తాత్కాలిక మరమ్మతుల విధానం సిఫారసు

పీసీ ఘోష్ కమిషన్‌కూ చేరిన నివేదిక 

కాళేశ్వరంపై అవినీతి విచారణలో కీలకమయ్యే అవకాశం

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ బరాజ్ కుంగుబాటుపై మరో సం చలన విషయం బయటకు వచ్చింది. ఈ బరాజ్ ప్రారంభించిన ఏడాదే దెబ్బతిన్నదని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) మధ్యంతర నివేదికలో పేర్కొన్నది. బరాజ్‌కు ఒక్కరోజులో నష్టం జరుగలేదని, మొదటిసారి నీటిని నింపినప్పుటి నుంచే నష్టం జరుగుతూ వచ్చిందని వెల్లడించింది.

ఈ నెల ఒకటో తేదీన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శికి నివేదిక అందజేసింది. ఇందులో బరాజ్‌కు నష్టం జరిగిన తీరుతోపాటు మరమ్మతులు చేపట్టాల్సిన విధానాన్ని కూడా వివరించింది. మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై ఎన్డీఎస్‌ఏ ఏర్పాటుచేసిన కమిటీ మార్చి 6 నుంచి 9 వరకు ప్రాజెక్టును సందర్శించింది. నీటిపారుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. అధికారులు, కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి, తాత్కాలిక మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలను సూచించింది.

2019 జూన్‌లోనే

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ను 2019 జూన్‌లో అట్టహాసంగా ప్రారంభించింది. బరాజ్ గేట్లను మూసివేసి ఆ సంవత్సరం వర్షాకాలంలో వరదను రిజర్వాయర్‌లో నిలిపారు. ఆ సమయంలోనే బరాజ్ దెబ్బతిన్నట్టు ఎన్డీఎస్‌ఏ నిపుణులు గుర్తించారు. బరాజ్ దిగువ భాగంలోని సీసీ బ్లాక్‌లు, అప్రాన్ నాడే దెబ్బతిన్నట్టు నిర్ధారించారు. ఆ సమయంలోనే నీటిని దిగువకు వదిలి మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేశారని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.  

ఎన్నికల సమయంలో బట్టబయలు

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో 2023 అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 6.20 గంటల సమయంలో మేడిగడ్డ బరాజ్ బ్లాక్ భారీ శబ్ధం వచ్చి రోడ్డు బ్రిడ్జి ప్యానెళ్లు కుంగిపోయాయి. ఆ మరుసటి రోజు నీటిపారుదల శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి బరాజ్‌కు జరిగిన నష్టాన్ని గుర్తించారు. అయితే.. ప్రారంభమైన ఏడాదే బరాజ్ దెబ్బతిన్నట్టు తెలిసినా ప్రభుత్వం ఉద్దేశపూర్వకం గానే దాచిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభమైన ఏడాదే పగుళ్లు వచ్చాయని తేలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు.

ఎన్డీఎస్‌ఏ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాళేశ్వరం అవినీతిపై ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిటీకి కూడా చేరింది. ఈ కమిటీ విచారణకు ఎన్డీఎస్‌ఏ నివేదిక కీలకం కానుందని సమాచారం. ఈ అంశంపై అధికారులను, ప్రభుత్వంలో భాగస్వాములైనవారిని కూడా విచారించే అవ కాశం ఉందని నీటిపారుదల శాఖలో చర్చించుకుంటున్నారు. మూడో విడత విచారణలో భాగంగా ఈ నెలాఖరున జస్టిస్ పీసీ ఘోష్ రాష్ట్రానికి రానున్నారు. ఎన్డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా కొందరికి నోటీసులు జారీచేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.