calender_icon.png 23 October, 2024 | 5:45 PM

నన్ను స్టార్‌ను చేసింది.. తెలుగు ప్రేక్షకులే!

08-07-2024 11:42:50 PM

కమల్ హాసన్ కాంబో లో 1996లో వచ్చిన చిత్రం ‘భారతీయుడు’. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘భారతీయుడు ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ శంకర్, నటులు కమల్ హాసన్, సిద్ధార్థ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, నిర్మాత దగ్గుబాటి సురేశ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు.. 

కమల్ హాసన్ మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులే నన్ను స్టార్‌ను చేశారు. తెలుగులోనే నాకు క్లాసిక్ హిట్స్ ఉన్నాయి. ‘భారతీయుడు లో సేనాపతి చెప్పే డైలాగ్స్ అన్నీ కూడా సమాజంలో నుంచి వచ్చినట్టే ఉంటాయి. సాంగ్స్, ఫైట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. నేను గురువు అని సిద్ధార్థ్ ఎప్పుడూ చెప్తుంటాడు. అవే మాటలు నేను శివాజీ గణేశన్ గారికి చెప్తుండేవాడిని. సిద్ధార్థ్, నేను ఏకలవ్య శిష్యులం. మాలాంటి వాళ్లు ఇంకా ఇండస్ట్రీకి రావాలి” అన్నారు. 

డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. “భారతీయుడు’ టైంలో సీక్కెవల్ తీస్తానని అనుకోలేదు. ఆ మూవీ తర్వాత ఇన్నేళ్లలో ఎక్కడ లంచం తీసుకున్నారనే వార్తలు చదివినా నాకు సేనాపతి గుర్తుకు వచ్చేవాడు. కానీ, స్టోరీ సెట్ అవ్వలేదు. ‘2.o’ తర్వాత స్టోరీ కుదరటం.. కమల్ గారికి చెప్పటంతో ఈ సినిమా మొదలైంది. నేను ఓ సీన్ రాసిన దాని కన్నా ఆయన నటించిన తర్వాత ఆ సీన్ స్థాయి పదింతలు పెరుగుతుంది” అని చెప్పారు. సిద్ధా ర్థ్ మాట్లాడుతూ.. “భారతీయుడు’ నా జీవితంలో ఎంతో ముఖ్యమైంది.

సమాజంలోని వైరస్‌ను పారదోలేందుకు శంకర్ గారు తీసుకొచ్చిన అప్డేటెడ్ యాంటీ వైరస్ ‘భారతీయుడు యువత ఈ సమాజం కోసం ఏం చేయాలో చెప్పే చిత్రమిది. సురేశ్ బాబు మాట్లాడుతూ.. “ట్రైలర్ చూసిన వెంటనే శంకర్ గారి నంబర్ కనుక్కొని మెస్సేజ్ చేశాను. కమల్ గారు మన ఇండియన్ సినిమా హద్దుల్ని చెరిపేస్తూ ముందుకెళ్తూనే ఉన్నారు. నిజాయితీగా మనం ఏదైనా చేస్తే వచ్చే సంతోషం మామూలుగా ఉండదు” అన్నారు. 

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. “భారతీయుడు’ సీక్వెల్‌లో నేను నటిస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇంత మంచి పాత్ర ఇచ్చిన శంకర్ గారికి థాంక్స్. కమల్ హాసన్ సర్‌తో పనిచేయడం అంటే కల నెరవేరినట్టే” అని చెప్పింది.