calender_icon.png 4 March, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడమ్.. స్పెషల్ నెట్‌వర్క్!

04-03-2025 01:56:30 AM

  1. పార్టీ పనితీరుపై రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్ సమాచార సేకరణ
  2. పార్టీ బలోపేతం, అంతర్గత విభేదాలను చక్కదిద్దేందుకు యాక్షన్ ప్లాన్
  3. నేడు మెదక్, మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశం 
  4. రేపు కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి పరిధిలోని నేతలతో భేటీ 

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): తెలంగాణలోని రాజకీయాలు, కాంగ్రెస్‌పార్టీ పనితీరును తెలుసుకునేందుకు రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యేక నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సెలైంట్‌గా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో ఇప్పటికే నివాసముంటున్న ఆమె స్నేహితు లు, మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆమెను రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన వెలువడిన మరుసటిరోజే తన స్నేహితులకు ఫోన్‌చేసి రాష్ర్ట రాజకీయాలపై ఆరా తీసినట్లు తెలిసింది.

దీని ఆధారంగానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ నేతల ప్రచారం సరిగా లేదని తెలుసుకుని, అందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆదే శించినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రభుత్వ పనితీరుపై బీజేపీ, బీఆర్‌ఎస్ చేస్తున్న రాజకీయ విమర్శలపైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది.

సంస్థాగత బలోపేతానికి..

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలను చక్కదిద్దేందుకు మీనాక్షి నటరాజన్ కార్యాచరణ ప్లాన్ చేశారు. అందుకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులోభాగంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మెదక్, సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి.

బుధవారం ఉదయం 11 గంటలకు కరీంనగర్, మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబా ద్, సాయంత్రం 5 గంటలకు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం నిర్వహించనున్నా రు. ఈ సమావేశాలకు  ఆయా నియోజకవర్గాల పరిధిలోని  మంత్రులు, ఇన్‌చార్జ్ మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, ఎమ్మె ల్యే ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాయకులు, ఇతర నాయకులను ఆహ్వానించారు. 

రోహిణ్‌రెడ్డికి క్లాస్..

రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న మీనాక్షి హైదరాబాద్ కాచిగూడ రైల్వేస్టేషన్‌లో అడుగుపెట్టిన వెంటనే పరిసరాల్లో కాం గ్రెస్‌నేత రోహిణ్‌రెడ్డి ఏర్పాటు చేసిన కటౌట్లను వీక్షించారు. అనంతరం అతిథి గృహానికి  వచ్చాక టిఫిన్ చేస్తున్న సమయంలో ఫ్లెక్సీల అంశాన్ని రాష్ట్ర నాయకుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.

కటౌట్లు వద్దని చెప్పినా ఎందుకు ఏర్పాటు చేయించారు..? ఆ ఖర్చును పేదలకు సాయం చేయొచ్చు కదా..? మళ్లీ ఇలాంటి కటౌట్లు ఇంకోసారి తనకు కనిపించవద్దని అక్కడున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు కటౌట్లు ఏర్పాటు చేయించిన రోహిణ్‌రెడ్డికి క్లాస్ పీకినట్లు తెలిసింది.