calender_icon.png 26 December, 2024 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మచ్చర్ల లిఫ్టు కేసీఆర్ గిఫ్ట్

25-12-2024 04:04:40 PM

కాంగ్రెస్, బీజేపీలు ఆర్మూర్ పాలిట అష్టదరిద్రాలు

గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే తెచ్చిన నిధులు నిల్

ఓడిన కాంగ్రెస్ నేత అవినీతి ఫుల్

ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కిల్

బీఆర్ఎస్ హయాంలోనే లిఫ్టుల మంజూరు-మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

ఆర్మూర్, (విజయక్రాంతి) : రైతుల చిరకాల వాంఛ అయిన మచ్చర్ల లిఫ్టు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. మచ్చర్ల లిఫ్టు పనులను బుధవారం పరిశీలించిన జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్మూర్ నియోజక వర్గానికి  మంజూరైన మూడు కొత్త లిఫ్టులు బీఆర్ఎస్ ఇచ్చినవేనని స్పష్టం చేశారు. మచ్చర్ల, జోధ్ పూర్, కుద్వాన్ పూర్ గ్రామాల రైతులకు చెందిన 2,860 ఎకరాల భూమిని సాగులోకి తెచ్చేందుకు మచ్చర్ల లిఫ్టుకు రూ.40కోట్లు, ఫత్తేపూర్, చేపూర్,  సుర్బిర్యాల్ లిఫ్టుకు రూ.110కోట్లు, చిక్లీ-గుంజిలీ లిఫ్టుకు రూ.89కోట్లను తానే మంజూరు చేయించానని జీవన్ రెడ్డి తెలిపారు.

బీఆర్ఎస్ హయాంలో మంజూరైందనే అక్కసుతో మచ్చర్ల లిఫ్ట్ పనులను గత ఏడాదిగా చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు. పైగా కాంగ్రెస్ నాయకులు మందికి పుట్టినోళ్లు మావాళ్లే అన్న చందంగా బీఆర్ఎస్ హయాంలో మంజూరైన లిఫ్టులను కూడా తామే మంజూరు చేయించామని చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాను రెండవ దఫా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే మచ్చర్ల లిఫ్టుకు రూ.40కోట్లు మంజూరు అయ్యాయని,  నిధులకు సంబంధించిన జీవో కూడా వచ్చి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి కాంట్రాక్టర్ తో అగ్రిమెంట్ కూడా జరిగిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ లిఫ్ట్ బీఆర్ఎస్ హయాంలో వచ్చిందనే అక్కసుతో ఏడాది కాలంగా పనులు చేపట్టకపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఆర్మూర్ పాలిట అష్టదరిద్రాలుగా మారాయని ఆయన మండిపడ్డారు.

గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే తెచ్చిన నిధులు నిల్ అని, ఓడిన కాంగ్రెస్ నేత అవినీతి ఫుల్ అని, ఈ రెండు పార్టీల పుణ్యమా అని ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కిల్ అని ఆయన ధ్వజమెత్తారు. ఆర్మూర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ హయాం స్వర్ణ యుగమని, కాంగ్రెస్, బీజేపీ లు రాతి యుగం తెచ్చాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ చేసింది శూన్యమన్నారు. ఇప్పటికైనా ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి పట్ల శ్రద్ద పెట్టాలని, లిఫ్టుల పనులు వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే  తామే వెంటాడి చేయిస్తామని హెచ్చరించారు. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలను వెంటాడి తీరుతామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.