తనకు పుట్టిన బాబును భార్య చనిపోవడంతో పరిస్థితుల కారణంగా ఒక వైద్యుడు తన వద్ద వైద్యానికి వచ్చిన వేరొక మహిళకు త్యాగం చేస్తాడు. ఆ తరువాత వైద్యుడితో పాటు మహిళ ఎదుర్కొన్న సమస్యలతో తీసిన చిత్రమే ‘మా బాబు’. ఈ చిత్రం 1960, డిసెంబర్ 22న విడుదలైంది. తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ‘చిరాగ్ కహా రోష్నీ కహా’ చిత్రానికి రీమేక్. అశోక్ నర్సింగ్ హోమ్‌లో ఆనంద్ వైద్య సేవలు అందిస్తూ ఉంటాడు. డాక్టర్ ఆనంద్‌కు గొప్ప వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులుండటంతో ఒక భాగ్యవంతురాలు గర్భిణిగా ఉన్న తన కోడలు రత్నను కాన్పు కోసం ఆయన వద్దకు తీసుకొస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆనంద్ భార్య కూడా మగబిడ్డను ప్రసవించి మరణిస్తుంది. మరోవైపు భర్త పోయి బిడ్డే తన జీవితమని నమ్మిన రత్నకు బిడ్డ పుట్టి మరణిస్తుంది. బిడ్డ లేడని తెలిస్తే రత్న బతకదని తెలుసుకున్న ఆనంద్ తన బిడ్డను రత్నకు పుట్టిన బిడ్డ అని ఇచ్చేస్తాడు. ఆ తరువాత ఆనంద్, రత్న జీవితాలతో విధి ఎలాంటి ఆటలాడిందనేది దర్శకుడు అద్భుతంగా చూపించారు.