calender_icon.png 20 October, 2024 | 5:26 AM

అశ్లీల నృత్యాలతో కస్టమర్లకు వల

20-10-2024 01:53:33 AM

  1. భాగ్యనగరంలో పబ్బుల వికృతచేష్టలు
  2. పోలీసులు దాడులు చేస్తున్నా మారని తీరు
  3. తాజాగా టేల్స్ ఓవర్ స్పిరిట్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు
  4. వందమంది కస్టమర్లతో సహా 40 మంది యువతుల అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి): హైద్రాబాద్ లో పబ్బుల వికృతచేష్టలు రోజురోజుకు హద్దులు దాటుతున్నాయి. కస్టమర్లను ఆకర్షించమే లక్ష్యంగా పబ్ నిర్వాహకులు యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు.

పోలీసులు నిరంతరం దాడులు చేస్తున్నా నిర్వాహకుల్లో మార్పు రావడం లేదు. తాజాగా బంజారాహిల్స్‌లోని  టేల్స్ ఓవర్ స్పిరిట్ పబ్ నిర్వా హకులు యువతులతో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. 100 మంది కస్టమర్లతో పాటు 4౦ మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

ఇతర రాష్ట్రాల అమ్మాయిలతో..

టేల్స్ ఓవర్ స్పిరిట్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడుల్లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను పబ్ యజమాన్యాలు ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీకెండ్‌లో నాలుగు గంటలు పనిచేస్తే రూ.2 వేలు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నట్లు తెలిసింది.

ఇక, పబ్‌కి వచ్చిన కస్టమర్లతో చనువుగా ఉంటూ, ఎక్కువ మద్యం సేవించేలా చూడాలని వారికి పురమాయిస్తున్నారు. మద్యం సేవిస్తున్నట్లు నటించి తామిచ్చే సాఫ్ట్ డ్రింక్స్ తాగాలని యువతులకు పబ్ యాజమాన్యం సూచించినట్లు తెలుస్తోంది. కస్టమర్లతో ఎక్కువ బిల్లు చేయించిన వారికి ఎక్కువ కమీషన్ ఇస్తున్నట్లు గుర్తించారు.

అసభ్య, అశ్లీల నృత్యాలు చేసే యువతులకు మరింత ఎక్కువ డబ్బు ముట్టజెబుతున్నట్లు విచారణలో తేలింది. మూడువారాలుగా పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెక్కి నిర్వహించి, శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మిక దాడులు చేశారు. పబ్‌లో ఉన్న 100 మంది కస్టమర్లు, 4౦ మంది యువతులు, ఏడుగురు పబ్ నిర్వాహకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. వారందరికీ నోటీసులు జారీ చేశారు. యువతులను పునరావాస కేంద్రాలకు తరలిం చారు. పబ్బు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మరోవైపు పబ్‌లో డ్రగ్స్ వినియోగించారా? లేదా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.