ఆదిలాబాద్ (విజయక్రాంతి): అంగన్వాడీలకు సరఫరా చేస్తున్న మాదిరిగానే మధ్యాహ్న భోజన కార్మికులకు సైతం నిత్యవసర వస్తువులు ప్రభుత్వమే సరఫరా చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుంటల రాములు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన కార్మికులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ శ్యామల దేవికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుంటల రాములు మాట్లాడుతూ... ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.10వేల వెంటనే అమలు చేయాలని, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని, వయస్సు పైబడిన కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు క్లియర్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీదేవి, పుష్ప, రాంబాయి, నాగమణి, అనిత, సత్యమ్మ, లక్ష్మి కార్మికులు పాల్గొన్నారు.