29-03-2025 12:13:01 AM
తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘటన
పటాన్ చెరు, మార్చి 28 : తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు శుక్రవారం వచ్చిన మద్యాహ్న భోజనం దుర్వాసన రావడంతో విద్యార్థులు పస్తులు ఉండాల్సి వచ్చింది. దాదాపు రెండు వందల మంది విద్యార్థులు మద్యాహ్నం భోజన్నాని ముట్టుకోలేదు. వివరాలలోకి వెళ్తే...తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అక్షయ పాత్ర ద్వారా మద్యాహ్నం వచ్చిన భోజనాన్ని తినేందుకు సిద్దమైన విద్యార్థులు దుర్వాసన రావడంతో ఆహారాన్ని పారవేశారు.
ఆహారం నీళ్లు నీళ్లుగా ఉండడం, వాసన రావడంతో విద్యార్థులెవరు భోజనాన్ని తినలేదు. విషయం తెలుసుకున్న అక్షయ పాత్ర నిర్వాహకులు తిరిగి మరొక పాత్రలో ఆహారాన్ని తీసుకొచ్చారు.
ఈ విషయమై పాఠశాల హెచ్‌ఎం భాస్కర్ ను వివరణ కోరగా తాను పదో తరగతి పరీక్షల నిమిత్తం సంగారెడ్డిలో ఉన్నానని చెప్పారు. అక్షయ పాత్ర ద్వారా వచ్చిన ఆహారం దుర్వాసన వచ్చిన విషయాన్ని ఉపాధ్యాయులు తనకు తెలిపారని హెచ్‌ఎం చెప్పారు. ఇదే విషయాన్ని అక్షయ పాత్ర ప్రతినిధులకు వివరించినట్లు చెప్పారు.