మండలంలోని పలు పాఠశాలను తనిఖీ...
తేమ శాతం వచ్చిన వెంటనే తూకం వేసి లోడ్ చేయాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
రేవల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ముందుగా సూపర్ వైజర్లు తిన్న తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ రేవల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలతో పాటు, తల్పునూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంను ఆకస్మికంగా సందర్శించారు. కేజీబీవీలో వంట సామాగ్రిని భద్రపరిచిన గదిని తనిఖీ చేసిన కలెక్టర్ రిజిస్టర్లను పరిశీలించారు. స్టాక్ వచ్చినప్పుడు రిజిస్టర్ లో ఎంట్రీ చేయాలని చెప్పారు. విద్యార్థుల సమక్షంలోనే స్టాక్ ను దించుకోవాలని సూచించారు. వంట సామాగ్రికి సంబంధించిన వస్తువులు ఎక్స్పెరి డేట్ తప్పనిసరిగా చెక్ చేయాలని చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజనం ముందుగా సూపర్ వైజర్లు తిన్న తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని సూచించారు. ఒకవేళ ఆహారం రుచికరంగా లేకపోతే తిరిగి మళ్ళీ వండి విద్యార్థులకు వడ్డించాలని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. తల్పునూరు జెడ్పి పాఠశాలలో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా తలుపులు, కిటికీలు, గేట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
తేమ శాతం వచ్చిన వెంటనే తూకం వేసి లోడ్ చేయాలి
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు తెచ్చిన ధాన్యంకు నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే తూకం వేసి లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పీపీసీ కి ధాన్యం తెచ్చిన తర్వాత రిజిస్టర్ లలో ఎంట్రీ చేయాలని, తూకం వేసిన తర్వాత తప్పకుండా ట్యాబ్ ఎంట్రీ కూడా చేయాలని సూచించారు. మండలంలోని ప్రతి సెంటర్లో కూడా ఇదే విధంగా అన్ని రిజిస్టర్లు మెయింటైన్ చేయడంతో పాటు తాలు లేకుండా చేసేందుకు ఫ్యాన్లను కూడా అందుబాటులో ఉంచాలని ఏపీఎంకు సూచించారు. జెడ్పి సీఈవో యాదయ్య, డిపిఆర్ఓ సీతారాం, రేవల్లి తహసిల్దార్ లక్ష్మీదేవి, ఎంపీడీవో నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు సిబ్బంది, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.