calender_icon.png 24 November, 2024 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజనం మారాల్సిందే!

24-11-2024 03:17:04 AM

ఒక్కో విద్యాసంస్థలో ఒక్కోలా మెనూ అమలు

కొత్త బియ్యం, సరుకుల్లో లోపిస్తున్న నాణ్యత 

అన్ని పాఠశాలలకు టెండర్లతోనే సరుకులివ్వాలి

అన్ని బడుల్లో ఒకే మెనూ అమలు చేస్తే ఫలితం

ఫుడ్ పాయిజన్ ఘటనలకు చెక్ పడే అవకాశం

బియ్యం, సరుకులను ప్రభుత్వమే అందించాలి 

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ ఫుడ్‌పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. ౪ రోజుల క్రితం నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే స్పందించారు.

ఇది మరవక ముందే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడం ఆందోళనకు గురిచేస్తుంది. ఘటనలు జరిగినప్పుడు సంబంధిత జిల్లా అధికారులు, హెడ్మాస్టర్లు, మధ్యాహ్న భోజన కార్మికులను బాధ్యులుగా చేసి వారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం కన్నేసి, మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఒక్కో స్కూళ్లో ఒక్కోలా మెనూ 

ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో, లోకల్‌బాడీ యాజమాన్యాల ద్వారా నిర్వహించే పాఠశాలల్లో వేర్వేరుగా మెనూ అమలు చేస్తున్నారు. అలా కాకుండా అన్ని పాఠశాలల్లోనూ ఒకే మెనూ అమలు చేయడంతో నాణ్యత ప్రమాణాలు మెరుగపడతాయనే విద్యానిపుణులు, అధ్యాపకులు అభిప్రాయ పడుతున్నారు. అలా చేస్తే కేజీబీవీ, రెసిడెన్షియల్, మాడల్ స్కూళ్లకు అందిస్తున్నట్టే ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలలకు కూడా టెండర్ల ద్వారా ప్రభుత్వమే సరుకులు అందుతాయి.

అంగన్‌వాడీలకు ప్రభుత్వమే కోడిగుడ్లను సరఫరా చేస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు సైతం కోడిగుడ్లు, చికెన్, బియ్యం, కూరగాయలు, పప్పులు, పెరుగు, వంట సరుకులను పంపిణీ చేస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. 

కొన్ని పాఠశాలల్లోనే నాణ్యమైన ఆహారం? 

అన్ని ప్రభుత్వ పాఠశాలలే. ఆయా స్కూళ్లలో చదివే వారంతా పేదవర్గాలకు చెందిన విద్యార్థులే. మరీ వీరికి పెట్టే ఆహారంలో తేడాలెందుకుంటున్నాయని పలువురు ఉపాధ్యాయులే ప్రశ్నిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో అతి నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించి మరికొన్ని పాఠశాలల్లో సాధారణమైన ఆహారాన్ని అందించడంతో ఆ ప్రభావం విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పైన పడుతోంది. 

శుభ్రత కరువు.. నాణ్యత కనుమరుగు 

మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా సరుకులు, బియ్యంలో నాణ్యతా లోపం కారణం. దీనికి తోడు వంట నిర్వాహకులు వ్యక్తిగత శుభ్రత పాటించడంతోపాటు వంట సామగ్రి, నాణ్యమైన కూరగాయలు వాడాలి. వంట గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కానీ, చాలా చోట్ల మధ్యాహ్న భోజనం వండేందుకు వంట గదులే లేవు. చెట్టుకింద, ఆరుబయట వండుతున్న పరిస్థితులు ఉన్నాయి.

కరీంనగర్ జిల్లా బూరుగుపల్లి పాఠశాలలో వంటకు కొత్త బియ్యం వాడటంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. వండిన తర్వాత అన్నం ముద్దలు ముద్దలు కావడం.. అది తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కొన్ని చోట్ల ఉడికీ ఉడకని అన్నం పిల్లలకు వడ్డిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి చర్యల వల్లనే ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు. 

సరుకుల సరఫరాకు టెండర్లు పిలవాలి

ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ బడుల్లో మధ్యాహ్న భోజన పథకానికి వాడే సరుకులను నిర్వాహకులే తెచ్చుకుంటారు. ఆకుకూరలు, కూరగాయలు, వంట సామగ్రి ఇతర వస్తువులను వారే కొనుగోలు చేసి తెచ్చుకొనే విధానం అమలవుతోంది. దీంతో మార్కెట్ ధరల్లో ఉండే హెచ్చు తగ్గులు నాణ్యతపై ప్రభావం చూపుతోంది.

ఈ విధానాన్ని రద్దు చేసి టెండర్ల ద్వారా ప్రభుత్వమే మెనూకు అనుగుణంగా విద్యార్థుల సంఖ్య ప్రకారం అవసరమైన వంట సరుకులు అందిస్తే నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించే వీలుంటుంది. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం, కుకింగ్ కాస్ట్‌ను పెంచి, బిల్లులు సకాలంలో చెల్లిస్తే కొంతలో కొంతన్న సత్ఫలితాలు వస్తాయి.


మంచి బియ్యం, సరుకులను ప్రభుత్వమే అందజేయాలి. కొత్త బియ్యం సరఫరా చేయడంతో విద్యార్థులు కొన్నిచోట్ల అస్వస్థతకు గురవుతున్నారు. కేజీబీవీ, మాడల్ స్కూల్, రెసిడెన్షియల్ విద్యార్థులకు అందించిన విధానంలోనే టెండర్ల ద్వారా సరుకులను ప్రభుత్వ పాఠశాలలకు అందించాలి. మధ్యాహ్న భోజన పథకం అమలులో సమస్యలు, అధికారుల చర్యలతో రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌ఎంలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇది విద్యాప్రమాణాలను దెబ్బతీస్తోంది. తన పరిధిలో లేని అంశాన్ని హెచ్‌ఎంలను అకారణంగా సస్పెండ్ చేయడం సరి కాదు. 


ప్రభుత్వ బడుల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం మెనూ ఇలా రోజు కేజీబీవీ గురుకులాలు ప్రభుత్వ, లోకబాడీ బడులు

సోమవారం రైస్, వెజిటేబుల్ కర్రీ, రసం రైస్, ఆకుకూర పప్పు, వెజ్‌కర్రీ రైస్, వెజిటేబుల్ కర్రీ, ఎగ్..గుడ్డు, ఆకుకూరపప్పు, ఘీ, పెరుగు ఎగ్, రసం, పెరుగు

మంగళవారం రైస్,వెజిటేబుల్ కర్రీ,రసం,ఎగ్, రైస్, టమాట పప్పు, వెజ్‌కర్రీ, రైస్, ఆకుకూర పప్పు ఆకుకూర పప్పు, ఘీ, పెరుగు ఎగ్,రసం,పెరుగు

బుధవారం రైస్,వెజిటేబుల్ కర్రీ,రసం, బగారా రైస్, మటన్ రైస్, వెజిటేబుల్ కర్రీ, ఎగ్ ఆకుకూరపప్పు, ఘీ, కర్డ్ లేదా చికెన్, కర్డ్, టమాట పప్పు,

(రెండు, నాల్గో బుధవారం చికెన్) వెజ్‌ఫ్రై, సాంబర్

గురువారం రైస్, వెజిటేబుల్ కర్రీ, రసం, ఎగ్, రైస్,ఆకుకూర పప్పు, వెజ్‌కర్రీ, రైస్, వెజిటేబుల్ కర్రీ, సాంబార్ ఆకుకూర పప్పు, ఘీ, పెరుగు ఎగ్, రసం, పెరుగు

శుక్రవారం రైస్, వెజిటేబుల్ కర్రీ, రసం, ఎగ్, రైస్, టమాట పప్పు, వెజ్‌కర్రీ, ఎగ్, రసం రైస్, వెజిటేబుల్ కర్రీ, ఎగ్ ఆకుకూర పప్పు, ఘీ, పెరుగు పెరుగు

శనివారం రైస్, వెజిటేబుల్ కర్రీ, రసం, ఆకుకూర వెజ్ ఫ్రైడ్‌రైస్, టమాట పప్పు, వెజ్‌కర్రీ వెజిటేబుల్ బిర్యానీ పప్పు, ఘీ, పెరుగు ఎగ్, సాంబర్, పెరుగు

వీటితోపాటు ప్రభుత్వ పాఠశాలలు మినహా రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉదయం అల్పాహారం, సాయంత్రం టీ, స్నాక్స్ ఇస్తున్నారు.

- పీ రాజభాను చంద్రప్రకాశ్, 

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల 

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు