calender_icon.png 8 January, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం!

08-01-2025 12:58:28 AM

  1. అమలు చేసే ఆలోచనలో ఇంటర్ విద్యాశాఖ
  2. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేపనిలో అధికారులు
  3. గత ప్రభుత్వంలో అమలుకాని హామీ

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేలా ఇంటర్మీడియట్ విద్యాశాఖ యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. అమలు విషయమై ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయాలని అధికారులు భావిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోలాగే ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, ఐటీఐ కళాశాలల్లో కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్ గత కొంత కాలంగా ఉంది. కానీ అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో అమలు చేస్తే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు.

దీంతో మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండదు. ఈ విధంగా డ్రాపౌట్ల సంఖ్య కూడా తగ్గించొచ్చు. చాలా మంది ఉదయం పూట కళాశాలలకు వచ్చి, మధ్యాహ్నం ఇళ్లకు వెళ్తున్నారు. కొందరు అర్థంతరంగా చదువును ఆపేస్తున్నారు. దీంతో ప్రతి ఏటా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది.

రాష్ట్రంలో ప్రభుత్వ ఇంటర్ కాలేజీలు 424 ఉన్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 24 జూనియర్ కాలేజీలు కొత్తగా ఏర్పాటయ్యాయి. ఇందులో సుమారు లక్షన్నరకు పైగా మాత్రమే విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్‌లో విద్యార్థులు ప్రతి ఏటా పెరిగిపోతుంటే సర్కారు కాలేజీల్లో మాత్రం డ్రాపౌట్ల సంఖ్య పెరిగిపోతోంది.

డ్రాపౌట్స్ తగ్గేలా..

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఒక్కో విద్యార్థికి అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులను భరిస్తున్నాయి. అయితే 9, 10 తరగతులకు మాత్రం సొంత నిధులను వెచ్చిస్తూ పథకాన్ని రాష్ట్రమే అమలు చేస్తోంది.

అలాగే జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఎన్నో ఏళ్లుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆయా ప్రభుత్వాలను కోరుతూ వస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది.

ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల ఎంత ఖర్చు అవుతుందని ఆరా తీశారు. రాష్ర్టంలో ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు ఐటీఐ చదివే విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి ఏటా సుమారు రూ.300 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అప్పట్లో అంచనా వేశారు.

అయితే నాటి నుంచి నేటి వరకు అది అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఈక్రమంలోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలుకు ఆలోచిస్తోంది. 

వచ్చే విద్యా సంవత్సరం నుంచి..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు పదేళ్లు గడిచింది. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదివే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యా హ్న భోజన సదుపాయం ఏర్పాటు జరగలేదు. మధ్యాహ్నం భోజనం పెడితే కాలేజీలకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకుల సొసైటీలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీ, ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న సుమారు 40 లక్షల మంది వరకు విద్యార్థులకు వసతి, భోజనం, ఉచితంగా దుస్తులు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.

కానీ, 424 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న లక్షన్నరకుపైగా ఉండే విద్యార్థులకు మాత్రం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడంలో తాత్సారం చేస్తున్నారు. జూన్ 1 నుంచి 2025-26 నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యం లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని పలు అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.