- ఒకప్పుడు 2,647 ఎకరాలకు సాగునీరు
- కుడి, ఎడమ కాలువల్లో పూడికతో 800 ఎకరాలకే పరిమితం
- స్పష్టంగా కనిపిస్తున్న అధికారుల నిర్లక్ష్యం
- కాలువలు బాగు చేయాలని ఆయకట్టు రైతుల డిమాండ్
వికారాబాద్, పరిగి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): పేరుకే లక్నాపూర్ ప్రాజెక్టు.. ఆయకట్టుకు అందుతున్న ప్రయోజనం మాత్రం అంతంతమాత్రం. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని ఈ ప్రాజెక్ట్ ఒకప్పుడు వేలాది ఎకరాలకు సాగునీరు అందించేది. ఏటా రెండు పంటలకు నీటి భరోసానిచ్చేది. పాలకుల పట్టింపులేని తనం, అధికారుల నిర్లక్ష్యంతో పంట కాలువలు, తూములు అనేక చోట్ల పూడిపోయాయి.
పంట కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిచాయి. దీంతో కుడి కాలువ నుంచి మొత్తం 1,504 ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 350 ఎకరాలకు మాత్రమే అందుతున్నది. ఎడమ కాలువ పొడవు మొత్తం11 కి.మీ కాగా, సుమారు 8 కి.మీ మేర పూడిపోయింది. కుడి కాలువ నుంచి 1,142 ఎకరాలకు నీరు పారాల్సి ఉండగా, ప్రస్తుతం 450 ఎకరాలకు మాత్రమే పారుతున్నది. కాలువ పొడవు 9 కి.మీ కాగా, ప్రస్తుతం 5 కి.మీ మేర పూడిపోయింది.
పూర్తి స్థాయిలో నీటిమట్టం
ఈ వానకాలం సీజన్‌లో సమృద్ధిగా వర్షా లు కురిశాయి. గడిచిన వారం రోజుల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. దీంతో లక్నాపూర్ ప్రాజెక్టులోకి భారీగా వరద చేరిం ది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామ ర్థ్యం 2.25 టీఎంసీలు, ప్రస్తుతం పూర్తిగా నిండింది. అయినప్పటికీ ఆయకట్టు పరిధిలోని లక్నాపూర్, మిట్టకోడూర్, రాజాపూర్, మోమిన్ కుర్థు, నాగారం, మోమిన్ కలాన్, ఐనాపూర్, అంతారం గ్రామాల పరిధిలోని 2,647 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. అంతా కలిసి 800 ఎకరాలకు మాత్ర మే నీరు అందుతుందని రైతులు వాపోతున్నారు. దీంతో రైతులు వాణిజ్య పంటలు పక్కన పెట్టి ఎలువ పంటలు మాత్రమే సాగునీరు అందుతున్నది.
కోట్లు ఖర్చు పెడుతున్నా..
ప్రాజెక్టు మరమ్మతులకు సర్కార్ రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా అక్కెరకు రావడం లేదు. మిషన్ కాకతీయలో భాగంగా గత ప్రభుత్వం సుమారు రూ. 35 లక్షలు ఖర్చు చేసి కాలువలు మరమ్మతులు చేపట్టింది. 2014లో కేంద్ర ప్రభుత్వ పథకం ట్రిపుల్‌ఆర్‌లో కింద మరో రూ.3.80 కోట్లు విడుదల కాగా, అధికారులు కాలువల మరమ్మతులు, రినొవేషన్, రీ స్టోరేషన్ వంటి పనులు చేపట్టారు. అంత ఖర్చు చేసినా ఆయక ట్టు పెరగక పోవడం గమనార్హం. ఎనిమిదేళ్ల నుంచి కేవలం 800 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతున్నది.