25-04-2025 01:33:04 AM
జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి..
రంగారెడ్డి,ఏప్రిల్ 24 (విజయ క్రాంతి ): ఎల్.ఆర్.ఎస్.తో ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని చేజార్చుకోవద్దని, సద్వినియోగం చేసుకోవాలని, అనధికార లే ఔట్ల క్రమబద్ధీకరణకు ఇంతకంటే అవకాశం మరొకటి ఉండదని, ఈ నెల 30లోగా చేసుకుంటే 25 శాతం రాయితీ వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఎల్‌ఆర్‌ఎస్ కు సమర్పించిన ఎల్1, ఎల్2, ఎల్3 దరఖాస్తు లపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరె న్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనధికార లేఔట్ల క్రమబద్దీకరణకు, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్ 25 శాతం రాయితీ అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వారందరూ నిర్ణీత గడువు లోగా సద్వినియోగం చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ నెల 30వ తేదీ నాటికి ఎల్ ఆర్ ఎస్ రాయితీ గడువు ముగుస్తున్నందున త్వరపడాలన్నారు.
గడువు పొడిగించే అవకాశం లేకపోవచ్చునని, మళ్లీ ఇటువంటి అవకాశాలు రావని, భూ యజమానుదారులు ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎల్.ఆర్.ఎస్ కు దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించడం జరిగిందన్నారు. ఫీజు చెల్లించేందుకు అర్హత ఉన్న ఎ ల్.ఆర్.ఎస్ దరఖాస్తుదారులు ఈ నెల 30వ తేదీలోగా నిర్ణీత రుసుము చెల్లిస్తే 25 శాతం రిబేటు వర్తిస్తుందని తెలిపారు.
రుసుము చెల్లించిన వారి దరఖాస్తును అధికారులు పరిశీలించి సత్వరమే అనుమతి మంజూరు చేస్తారని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో అనేక మంది తమ ప్లాట్లను, అనధికార లే ఔట్లను రాయితీతో కూడిన రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకున్నారని అన్నారు. అన ధికారికంగా లేఅవుట్లు చేసి, అందులో 10 శాతం ప్లాట్లను విక్రయించిన వారికి మిగతా ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలియజేసారు.
ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ఎల్.ఆర్.ఎస్. రుసుము చెల్లించి క్రమబద్దీకరణ చేసుకోవచ్చని తెలిపారు. క్రమబద్ధీకరించని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతి మంజూరు చేయడం జరగదని స్పష్టం చేశారు.
అందుచేత అర్హులైన వారందరు ఏప్రిల్ 30వ తేదీ లోపు క్రమబద్దీకరణ చేసుకోవాలని, ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల న్నారు. ఇప్పటికే ఈ గడువు మార్చి 31తో ముగియగా, ప్రభుత్వం ఏప్రిల్ 30వ తేదీ అనగా ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించిందని అన్నారు. రాయితీ వర్తింపునకు ఇదే చివరి అవకాశం అని కలెక్టర్ స్పష్టం చేశారు.