25-02-2025 01:05:21 AM
ప్లాట్ల క్రమబద్ధీకరణకు సరికొత్త నిబంధనలు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఎల్‌ఆర్‌ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) పెండింగ్ దరఖాస్తులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను మరింత సరళతరం చేయనుంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, ఇతర జలాశయాల సర్వే నంబర్లలోని లే అవుట్లలో ప్లాట్ల క్రమబద్ధీకరణకు సరికొత్త నిబంధనలను ప్రభుత్వం తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
2020 ఆగస్టు 26కు ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లతో పాటు అనధికార లే అవుట్‌లలో ఇప్పటికే పది శాతం విక్రయించి ఉన్న లే అవుట్లను ఈ ఆదేశాలతో క్రమబద్ధీకరించనున్నారు.
ఈ మేరకు ఈ నెల 22వ తేదీన జారీ చేసిన జీవో 28లోని నిబంధనలను మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం సోమవారం ఓ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు కేసులు, ఇరిగేషన్, రెవెన్యూ, డీటీసీపీ అభ్యంతరాలతో పాటు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యే ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు ఇదివరకే చెల్లించిన తొలి విడత ఛార్జీల్లో పది శాతాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నారు.
200 మీటర్లే ప్రామాణికం
ప్రతి జలాశయం 200 మీటర్ల లోపు ఉన్న లే అవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం జలాశయాలు, ప్రభుత్వ స్థలాల వద్ద 200 మీటర్ల సమీపంలోని సర్వే నంబర్లను రీవెరిఫికేషన్ చేయనుంది. ఈ లింక్‌ను సబ్ రిజిస్ట్రార్‌కు కూడా పంపి ఒకవేళ చెరువులు, కుంటలలతో పాటు ప్రభుత్వ స్థలాల్లో రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేసేలా నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది.
దీనికంటే ముందుగా సర్వేనంబర్లను ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ఈ దరఖాస్తులను రెవెన్యూ అధికారులు కూడా పరిశీలించిన తర్వాత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కు పంపనున్నారు.
ఆ దరఖాస్తులపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు డీటీసీపీ సహకారంతో ఫీల్డు వెరిఫికేషన్ నిర్వహించి, నివేదికలను పంపించాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. పరిష్కారానికి ఆమోదయోగ్యంగా ఉన్న దరఖాస్తులను మాత్రమే ఆ తర్వాత ప్రక్రియకు అనుమతించేలా చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లోనే ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.