calender_icon.png 16 November, 2024 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేరుకే ఎల్‌ఆర్‌ఎస్.. ఆచరణకు నో!

24-09-2024 12:07:41 AM

దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురుచూపులు

మెదక్ జిల్లాలో 12,234 దరఖాస్తులు

కేవలం 549 దరఖాస్తులకు మాత్రమే పరిష్కారం

పెండింగ్‌లో 11,685 దరఖాస్తులు

మెదక్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): అనుమతులు లేని ప్లాట్లు, అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆ ర్‌ఎస్) ప్రవేశపెట్టింది. కానీ అది ఆరంభ శూరత్వానికే సరిపోయింది. దరఖాస్తుదారులు దరఖాస్తులు ఇచ్చిన మూడు నెలల్లోపు పరిష్కరించాల్సి ఉండగా.. తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.

స్పెషల్ డ్రైవ్ చేపట్టి దరఖాస్తులకు మోక్షం కలిగిస్తామని ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. 2020 జనవరి నుంచి డిసెంబర్ వరకు మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు 12,234 దరఖాస్తు లు వచ్చాయి. వీటిలో కేవలం 549 దరఖాస్తులకు మాత్రమే పరిష్కారం లభించింది. 248 దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మరో 301 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇక మిగతా 11,685 దరఖాస్తు లూ పెండింగ్‌లోనే ఉన్నాయి.

మున్సిపాలిటీల వారీగా..

మెదక్ మున్సిపాలిటీలో 3,792 దరఖాస్తులు రాగా 150 దరఖాస్తులు అనుమతు లకు అనుకూలంగా ఉన్నాయి. 281 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మరో 3,361 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 71 దరఖాస్తులు రాగా ఆరు దరఖాస్తులు అనుమతులకు అనుకూలంగా ఉన్నా యి. మరో 65 పెండింగ్‌లో ఉన్నాయి. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 6,435 దరఖాస్తులు రాగా 50 మాత్రమే అనుమతులకు అనుకూలంగా ఉనానయి. మిగతా 6,385 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో 1,936 దరఖాస్తులు రాగా 42 మాత్రమే అనుమ తులకు అనుకూలంగా ఉన్నాయి. 20 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగతా 1,874 దరఖాస్తులు పరిశీలించాల్సి ఉంది.

నాలుగేళ్లుగా పెండింగ్..

గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌లో భాగం గా అనధికారిక ప్లాట్లు, లేఅవుట్లను క్రమబద్ధీకరిస్తామని 2020లో దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి భారీగా సంఖ్యలో దరఖాస్తులు దాఖలయ్యాయి. కానీ వాటి పరిష్కారానికి ప్రభు త్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నాలుగేళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నా యి. ప్రస్తుత ప్రభుత్వం వీటిని మూడంచెల వ్యవస్థ ద్వారా పరిష్కరిస్తామని చెబుతున్నా ఆచరణలో మాత్రం చేసి చూపించడం లేదు. దరఖాస్తులు అందిన మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ ఒక్క అడుగుకు కూడా ముందుకు కదలడం లేదు. కండితుడుపు చర్యగా ఇటీవల అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. కానీ, ఫలితాలు అంతగా ఉండకపోవచ్చని దరఖాస్తుదారులు పెదవి విరుస్తున్నారు.