calender_icon.png 25 October, 2024 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల అధికారులు సమన్వయంతో పని చేయాలి

25-10-2024 06:15:42 PM

గద్వాల (విజయక్రాంతి): గ్రామ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను పరిష్కరించేందుకు పంచాయితీ కార్యదర్శులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఇరిగేషన్ ఏఈ లు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఆదేశించారు. శుక్రవారం ఐ.డి.ఓ.సి కాన్ఫరెన్స్ హాల్ నందు గ్రామ స్థాయిలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై అన్ని మండలాల ఆర్.ఐ లు, ఎం.పి.ఓ లు, ఇరిగేషన్ ఎ.ఈ లతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను సమర్థవంతంగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

పంచాయితీ సెక్రటరీ, ఆర్.ఐ.ఎ.ఈ లు సమన్వయంతో పని చేసి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వారంలో ఒకసారి ఈ మూడు విభాగాల అధికారులు సమావేశమై పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయాలన్నారు. ప్రతి ఒక్క దరఖాస్తుదారునికి కాల్ చేసి వారి దరఖాస్తులపై అవసరమైన సమాచారం సేకరించుకొని వెంటనే పరిష్కరించాలన్నారు. సకాలంలో స్పందించని వారిని గుర్తించి ప్రత్యేక జాబితా తయారు చేయాలని అన్నారు. ఎం.పి.ఓ లు ప్రతి రోజు కనీసం 100 ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుదారులకు స్వయంగా కాల్  చేయాలన్నారు. పంచాయితీ సెక్రటరీ తమ పనులను సక్రమంగా నిర్వర్తించే ఈ విధంగా డి.పి.ఓ.కు సూచించారు. అసిస్టెంట్ ఇంజినీర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల పరిధిలో ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, వాటిని వేగంగా పూర్తి చేయాలని అన్నారు.

ఆర్.ఐ లు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రోహిబిటెడ్ ల్యాండ్స్, కోర్టు కేసులు, ప్రభుత్వ భూములు, సీలింగ్ ల్యాండ్స్ అంశాలపై శ్రద్ధ వహించి నమోదు చేయాలని అన్నారు. భూములు నీటి వనరుల పరిధిలో ఉన్నాయా లేదా అనేది ఇరిగేషన్ అధికారులు పరిశీలించాలని సూచించారు. సర్వే నంబర్ వారీగా వర్గీకరించి సులభంగా దరఖాస్తులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి అధికారికి వారికి కేటాయించిన లక్ష్యాలను వేగవంతంగా పొరపాట్లకు తావు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస రావు, డి.పి.ఓ శ్యాంసుందర్, ఇరిగేషన్ ఈ.ఈ శ్రీనివాస రావు, టౌన్ ప్లానింగ్ అధికారి కుర్మన్న,అన్ని మండలాల ఆర్.ఐ లు, ఎం.పి.ఓ లు, ఇరిగేషన్ ఎ.ఈ లు పాల్గొన్నారు.