calender_icon.png 21 October, 2024 | 8:57 AM

అండమాన్ తీరంలో అల్పపీడనం

21-10-2024 01:45:03 AM

  1. రేపు వాయుగుండంగా మారే అవకాశం 
  2. నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు
  3. ఎల్లో అలర్ట్ జారీచేసిన ఐఎండీ

హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): బంగాళాఖాతంలోని ఉత్తర అండమాన్ సముద్రతీరంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. ఈ ఆవర్తన గాలులు పశ్చిమ దిశగా కదిలి మంగళవారం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

ఈ వాయుగుండం 23వ తేదీన తుపానుగా మారొచ్చని పేర్కొంది. అంచనాల ప్రకారం తుపాను ఏర్పడితే.. 24వ తేదీన ఉదయం వాయుగుండం ఒడిశా మీదుగా తీరాన్ని దాటే అవకాశముందని వెల్లడించింది. అయితే ఆ ఆవర్తనం ప్రభావతంతో సోమవారం కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మంగళవారం అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని చెప్పింది.

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, నారాయణపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. సోమవారం వర్షసూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.