25-03-2025 06:04:48 PM
మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి..
మందమర్రి (విజయక్రాంతి): నానో ఎరువులను వాడడం వల్ల పెట్టుబడి తక్కువగా ఉండటమే కాకుండా పోషకాలు అధికంగా ఉంటాయని రైతులు నానో ఎరువులను వాడి పర్యావరణ హితంతో పాటు నేలను, నీటిని కలుషితం కాకుండా కాపాడుకోవాలని మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతిలు కోరారు. మండలంలోని శంకరపల్లి రైతు వేదిక ఆవరణలో మండల రైతులకు నానో ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
నానో ఎరువులు తక్కువ పరిమాణం తక్కువ పెట్టుబడి, సాధారణ యూరియా బస్తా ధర కంటే 20% తక్కువ ధరలో దొరుకుతుందని అదే స్థాయి పోషకాలను అందిస్తుందని ఆన్నారు. నానో ఎరువులు నేలలో నెమ్మదిగా కరిగి మొక్కకు పూర్తిస్థాయిలో అందుతుందని అంతే కాకుండా మొక్కలకు పూర్తి స్థాయి నియంత్రణ నిస్తుందనీ ఆన్నారు. రవాణాకు, నిల్వకు, పంటకు అందించుటకు నానో ఎరువులు సౌకర్యవంతంగా ఉంటాయని వారు వివరించారు. నానో ఎరువులను కేవలం పిచికారీ రూపంలో పైపాటుగా మాత్రమే వాడాలని, ఒక లీటరు నీటికి 4మీ.లీ నానో ద్రావణాన్ని కలిపి పై పాటుగా రెండు మూడు సార్లు పిచికారీ చేసుకోవాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కనకరాజు మండల రైతులు పాల్గొన్నారు.