- బీఆర్‌ఎస్ పాలనలో భ్రష్టుపట్టిన వ్యవస్థ
- ఆర్థికపరమైన ఒడిదుడుకుల్లో తెలంగాణ
- నెలకు రాష్ట్ర ఆదాయం రూ.18 వేల కోట్లు
- ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు రూ.6,500 కోట్లు
- అప్పులు, వడ్డీలకు మరో రూ.6,500 కోట్లు
- మిగిలిన రూ.5,500 కోట్లతోనే సంక్షేమ పథకాల అమలు
- టీజీవో డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన బీఆర్‌ఎస్ పరిపాలన వ్యవస్థను భ్రష్టుపట్టించిందని, దీంతో ప్రస్తుత రాష్ట్ర ఆదాయం తక్కువ ఉందని, వ్యయం మాత్రం చాలా ఎక్కువైందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో శుక్రవారం తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీజీవో) సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో డైరీని ఆవిష్కరించి మాట్లాడారు.
రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి, అవసరాలకు పొంతన లేకుండా ఉందన్నారు. అందుకే ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వానికి కాస్త సమయం పడుతున్నదని తేల్చిచెప్పారు. ఇంతటి ఆర్థిక ఒడిదుడుకుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు ఇస్తున్నామని తెలిపారు.
ఉద్యోగుల సమస్యలు వినేందుకు ఇప్పటికే తాము మంత్రివర్గ ఉపసంఘ కమిటీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధిని ప్రజల వరకు చేర్చేది ప్రభుత్వ ఉద్యోగులేనని కొనియాడారు. ప్రతి నెలా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.18,500 కోట్లు అని, ఆ మొత్తం ప్రభుత్వ అవసరాలకు సరిపోవడంలేదని స్పష్టం చేశారు.
అన్ని సక్రమంగా నిర్వహించాలంటే కనీసం నెలకు రూ.30వేల కోట్లు కావాల్సి ఉందన్నారు. వచ్చే ఆదాయం లో రూ.6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. మరో రూ.6,500 కోట్లు ప్రతి నెలా అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇక మిగిలిన రూ.5,500 కోట్లతోనే సంక్షేమ పథకాలు అమలు చేయా ల్సి వస్తున్నదన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నదన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పారదర్శకంగా ఖర్చు చేసేందుకు ఉద్యోగులు ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆదాయం ప్రతి నెలా మరో రూ.4 వేల కోట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగులు తమ సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతిసారి ధర్నాలే చేయాల్సిన అవసరం లేదని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని శక్తులు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నాయని పరోక్షంగా ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వానికీ ఉందని, అయినప్పటికీ ఏం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్వశిక్షా అభియాన్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పథకం అని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను రాష్ట్రప్రభుత్వం ఎలా రెగ్యులరైజ్ చేయగలదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం చేసే పనులను ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు.
డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, టీజీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారా యణ, పార్టీ నేతలు శ్యాం, ఉపేందర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రావు, లక్ష్మణ్ గౌడ్, కృష్ణయాదవ సహదేవ్, రామకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.