calender_icon.png 16 January, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగార్జున సాగర్‌కు తగ్గిన వరద పోటు

08-08-2024 03:00:44 AM

18 క్రస్టుగేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల

33 టీఎంసీలకు పులిచింతల నీటిమట్టం 

నల్లగొండ, ఆగస్టు 7 (విజయక్రాంతి): నాగార్జున సాగర్‌కు ఎగువ నుంచి వరద కాస్త తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్ట్ అధికారులు బుధవారం ఉదయం వరకు 22 క్రస్టుగేట్ల ద్వారా 3.5 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. 11 గంటల సమయంలో ఇన్‌ఫ్లో 2.95 లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో 4 క్రస్టు గేట్లను మూసేసి వచ్చిన వరదను వచ్చినట్లు 18 క్రస్టు గేట్ల ద్వారా నదిలోకి వదులుతున్నారు.

ప్రాజెక్ట్ నీటిమట్టం 590 అడుగులు (312.5050 టీఎంసీలు) కాగా ప్రస్తుత నీటిమట్టం 584.50 అడుగులు (296 టీఎంసీలు)కు చేరుకున్నది. ప్రస్తుతం రిజర్వాయర్ నుంచి ఎస్సెల్బీసీ (ఏఎమ్మార్పీ)కి 1800 క్యూసెక్కులు,  కుడి కాల్వకు 6979 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు అధికారులు 8,193 క్యూసెక్కుల జలాలను వదులుతున్నారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. సాగర్ నుంచి భారీగా వరద రావడంతో పులిచింతల ప్రాజెక్టుకు కేవలం 36 గంటల్లోనే 23 టీఎంసీలకుపైగా నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు (45.77 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 168.76 అడుగులు (33.03 టీఎంసీలు)గా ఉంది. 13 గేట్లు ఎత్తి 2.78 లక్షల క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. 

పర్యాటకుల సందడి..

నాగార్జున సాగర్ క్రస్టుగేట్ల నుంచి కృష్ణమ్మ దిగువకు పరుగులు పెడుతుండడంతో ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. డ్యామ్ పరిసరాల్లో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ నదిలో ప్రవాహాన్ని తిలకిస్తున్నారు. 

మేడిగడ్డకు తగ్గిన వరద..

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 7 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ లక్ష్మీబరాజ్‌కు వరద ఉధృతి తగ్గు ముఖం పట్టింది. వర్షాలకు కొద్దిరోజులుగా బరాజ్‌కు వరద పోటు తగిలింది. వర్షాలు నెమ్మదించడంతో వరద తగ్గింది. బుధవారం మేడిగడ్డ బరాజ్‌కు ఎగువ నుంచి 3.62 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, అధికారులు బరాజ్ 85గేట్లు ఎత్తి అదే స్థాయిలో జలాలను వదులుతున్నారు.