calender_icon.png 31 October, 2024 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తక్కువ ఖర్చు త్వరగా పూర్తి

08-07-2024 12:46:18 AM

  • సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి 
  • అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టినవి, అసంపూర్తిగా ఉన్నవి, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరు అందించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిలో తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగునీటిని అందించే ప్రాజెక్టులపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. గోదావరి, కృష్ణా బేసిన్‌లో అర్ధంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టుల వివరాలన్నీ ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆరా తీశారు.

సాగునీటిని అందిం చాలంటే ఆయకట్టుకు నీరందించే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బరాజ్‌లు, పంప్‌హౌస్‌లకే పరిమితమయ్యాయని, భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించడం తప్ప ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీటిని అందించే కాల్వలు నిర్మించకుండానే వదిలేయడంతో పాటు గత ప్రభుత్వం చేపట్టిన చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇటీవలే పలు దఫాలుగా ఈ ప్రాజెక్టులపై చర్చించిన సీఎం తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు, వీలైనంత త్వరగా సాగునీటిని అందించే ప్రాజెక్టులను చేపడితే రైతులకు ప్రయోజనం కలుగుతుందని అందుకే అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు.

ఇందులో భాగంగా గోదావరి బేసిన్‌లో ఉన్న నీల్వాయి వాగు, పింప్రీ ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజ్ 2, సదర్మట్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు దాదాపుగా రూ.241 కోట్లు ఖర్చు అవుతాయని, దాదాపుగా 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని ఇరిగేషన్ విభాగం అంచనాలు రూపొందించింది. తక్కువ నిధులతో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుల పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి వంద శాతం పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అందుకు వీలుగా నిర్ణీత గడువు నిర్దేశించుకోవాలని, ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నీల్వాయి వాగు ద్వారా మంచిర్యాల జిల్లా, పింప్రీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా నిర్మల్ జిల్లా, పాలెం వాగుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మత్తిడి వాగుతో ఆదిలాబాద్ జిల్లా, ఎస్సారెస్పీ స్టేజ్ 2తో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాలకు, సదర్మట్ ప్రాజెక్టుతో నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగునీరు అందుతుంది.